Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో లౌకిక ప్రజాస్వామ్యంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ విమర్శించారు. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్లో ఉన్న సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద బుధవారం 'బీజేపీ హటావో-దేశ్‌కో బచావో' పాదయాత్ర ప్రచార హోర్డింగ్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ బీజేపీకి ఎంఐఎం బీటీమ్‌గా పనిచేస్తున్నదని అన్నారు. బలంలేని చోటకూడా ఎంఐఎం తమ అభ్యర్థులను పోటీలోకి దింపి పరోక్షంగా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తున్నదని విమర్శించారు. బీజేపీ, ఎంఐఎం అనైతిక బంధం వల్ల లౌకిక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. మతం ఆధారంగా ప్రజలను విభజించే శక్తులైన బీజేపీ, ఎంఐఎం ఎదుగుదల దేశానికి ప్రమాదకరమని అన్నారు. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, అధిక ధరలతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతు న్నదని అన్నారు. 'బీజేపీ హటావో-దేశ్‌కో బచావో' నినాదంతో దేశవ్యాప్తంగా ఈనెల 14 నుంచి వచ్చేనెల 15 వరకు పాదయాత్రలు నిర్వహించాలని తమ పార్టీ జాతీయ సమితి పిలుపునిచ్చిందని వివరించారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో నెలరోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ ఛాయాదేవి, సహాయ కార్యదర్శి స్టాలిన్, కమతం యాదగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి వెంకటేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు నెర్లకంటి శ్రీకాంత్, చెట్టుకింది శ్రీనివాస్, విద్యార్థి నాయకులు కళ్యాణ్ సందీప్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.