Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ముద్దాయిలుగా ఉన్న వారిని బీజేపీ శ్రేణులు సన్మానించడం అప్రజాస్వామికమని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలీ ఉల్లా ఖాద్రీ కె ధర్మేంద్ర బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లీకేజీ సూత్రధారులకు బీజేపీ అండగా ఉంటుందనే ప్రత్యక్ష సంకేతాన్ని ఇవ్వటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రధాన ముద్దాయి పోలీసు ఉన్నతాధికారులపై అసత్య ఆరోపణలు చేస్తూ, కేసు నుంచి తప్పించుకోవాలనే కుయుక్తులు చేస్తున్నారని తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేసే బీజేపీ కుటిల నీచ రాజకీయాలను విద్యార్థులు, యువత దృష్టికి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే హైకోర్టు న్యాయమూర్తితో సత్వర విచారణ చేపట్టి దోషులను జైలుకు పంపాలని కోరారు.