Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయంతో రాంగ్ బబ్లింగ్
- డబ్బుల కోసం పేపర్స్ విక్రయాలు
- ప్రధాన నిందితుడు ప్రవీణ్ లింక్‌లపై ఆరా
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే సిట్ విచారణలో రోజుకో లింకులు బయటకు రావడంతో మరింత ఆసక్తిగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యులు లింగారెడ్డితోపాటు పలువురిని అధికారులు విచారించారు. ఉద్యోగాల నియామకాలు, పేపర్ లికేజీ, ప్రవీణ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని సెక్రటరీ ఆధీనంలోనే కాన్ఫిడెన్షియల్ విభాగం మొత్తం నడుస్తుంది. ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపరచడం ఇలా అన్ని కార్యక్రమాలూ సెక్రటరీ ఆధీనంలోనే జరుగుతాయి. లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ అనితా రామచంద్రన్ వద్ద పీఏగా పనిచేసిన విషయం తెలిసిందే. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రాసిన ప్రవీణ్‌కు అందులో 103 మార్కులు రావడంతో విచారణ అధికారులు ఆ దిశగా ఆరా తీశారు. ఈ కేసులో 18 మంది నిందితుల్లో ఇప్పటి వరకు 17మందిని అరెస్టు చేసిన అధికారులు పలువురిని విచారించారు. వారిచ్చిన సమాచారంతో దర్యాప్తు అంతా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, ఎవరెవరికి వెళ్లాయి, ఎంత మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి అనే కోణంలో జరిగింది. ప్రవీణ్ నుంచి కీలక సమాచారం సేకరించారు. మరోసారి ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిని కస్టడీకి తీసుకుని ఈడీతో కలిసి తిరిగి విచారించాలని సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వీడు మామూలోడు కాడు...
ప్రవీణ్ తండ్రి ఓ పోలీస్ అధికారి. తన తండ్రికి సమాజంలో వస్తున్న గౌవరవాన్ని చిన్నప్పటి నుంచి గమనించేవాడు. దాంతో తాను కూడా పోలీస్ డిపార్టుమెంట్లో చేరాలని కోరిక ఉండేది. యూనిఫామ్ వేసుకోవాలన్న కోరిక చిన్నప్పటి నుంచి బలంగా నాటుకు పోయింది. ఇప్పటికీ తన కారుపై పోలీస్ స్టిక్కర్ అతికిం చుకుని తిరుగుతున్నాడు. అమ్మాయిలను పరిచయాలు చేసుకుని చాటింగ్‌లు చేసేవాడు. ఇదిలావుండగా, ఎలాగైనా యూనిఫామ్‌కు అర్హత సాధించాలనే ఆలోచనతో గ్రూప్-1 పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌రెడ్డితో చేతులు కలిపి గ్రూప్-1పేపర్‌ను కంప్యూటర్ నుంచి చాకచక్యంగా తస్కరించాడు. అంతా సజావుగా జరిగిపోయిందను కున్నాడు. కానీ ఏదో తెలియని భయం ప్రవీణ్‌ను వెంటాడింది. ఈ క్రమంలో డబ్బుల కోసం ఆ పేపర్‌ను ఇతరులకు విక్రయించాడు. అంతేకాకుండా గ్రూప్-1 పరీక్షలో మార్కులు అధికంగా వస్తే ఎక్కడ పట్టుపడిపోతానోనని భయంతో కావాలనే బబ్లింగ్ రాంగ్ చేశాడు. పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఆ వాట్సప్‌లో సభ్యులుగా 8 వేల మంది
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో వేలాది మంది రాంగ్ బబ్లింగ్ చేశారు. వారందరూ కలిసి ఒక వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. దాదాపు 8000 మందిని సభ్యులుగా చేర్చారు. ఆ వాట్సప్ గ్రూప్‌లో సభ్యులుగావున్న ప్రవీణ్ ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ గ్రూప్‌లో ప్రవీణ్ ఎవరెవరితో చాట్ చేశాడు, ఆర్థిక లావాదేవీల అంశాలతోపాటు ఇతర అంశాలపై ఆరా తీస్తున్నారు.