Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును తగ్గించడం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్జీసీసీఎల్ఏ-475) తెలిపింది. ఇలాంటి చర్యల ద్వారా కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలను మనోవేదనకు గురిచేయొద్దని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయంలో బుధవారం టీఎస్జీసీసీఎల్ఏ-475 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్ల నుంచి 58 ఏండ్లకు తగ్గించడం వల్ల వారు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల రెగ్యులర్ అధ్యాపకుల మాదిరిగానే వారి ఉద్యోగ విరమణ వయస్సును కూడా 61 ఏండ్లకు పెంచాలని కోరారు. అందుకనుగుణంగా ఈ ఏడాది జనవరి 31న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచారని వివరించారు. దానివల్ల వంద మంది కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం జరిగిందని తెలిపారు. కానీ మళ్లీ 58 ఏండ్లకు తగ్గించడం వల్ల వంద మంది కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల ఒకటో తేదీ నుంచి క్రమబద్ధీకరణ చేస్తామంటూ సాక్షాత్తు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఒకవైపు క్రమబద్ధీకరణ చేయకపోగా, పెంచిన ఉద్యోగ విరమణ వయస్సును తగ్గించడం పట్ల కాంట్రాక్టు అధ్యాపకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేయాలని కోరారు.