Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారంలో జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఆ కమిషన్ నివేదికలో పోలీస్ అధికారులపై పేర్కొన్న అంశాలను సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీల ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. పోలీస్ అధికారుల సంఘం తరపున అడ్వకేట్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ''కమిషన్ల రిపోర్టులు క్రిమినల్ కేసుల్లో వర్తించవు. ఆయా కేసుల్లో సీఆర్పీసీ ప్రొవిజన్స్ ప్రకారమే నడుచుకోవాలని చట్టాలు చెబుతున్నాయి. జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్‌ను నిజనిర్ధారణ కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. అదో బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథం కాదు. ఈ కేసు విచారణలో ఆ కమిషన్ నివేదికను ఆధారంగా తీసుకోవద్దు.'' అని నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు విన్నవించారు. దర్యాప్తునకు సంబంధించిన అనేక అంశాలపై కమిషన్ తన పరిధిని దాటి నివేదికలో కామెంట్ చేసిందని ఆయన అభ్యర్థించారు. క్రిమినల్ ప్రొసిడింగ్స్ నడుస్తున్న సమయంలో ఏకపక్షంగా కమిషన్ నివేదిక ఇవ్వడం సరికాదని విన్నవించారు. ఈ అంశాలు పోలీస్ అధికారుల వృత్తిపై వ్యతిరేక ప్రభావం చూపుతాయని వివరించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆత్మరక్షణ కోసం నిందితులపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లన్నింటినీ డిస్మిస్ చేయాలని విన్నవించారు. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 21కి హైకోర్టు వాయిదా వేసింది.
లాకర్ల తాళాలు కనిపించకపోవడంపై రిపోర్టు సమర్పించాలి : కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం
జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ సీటుకు 2018లో జరిగిన ఎన్నికలకు చెందిన ఫైళ్లు, ఈవీఎంలు భద్రం చేసిన స్ట్రాంగ్ రూంలోని కొన్ని లాకర్ల తాళాలు కనిపించకుండాపోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు చేసి రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తాళాలు కనిపించకపోవడంపై విచారణ చేయిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో ఆ మేరకు బుధవారం జస్టిస్ లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26 నాటికి నివేదిక ఇవ్వాలన్నారు. విచారణను 18కి వాయిదా వేశారు. ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ (మంత్రి) ఎమ్మెల్యేగా గెలుపొందడాన్ని సవాల్ చేస్తూ ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎ.లక్ష్మణ్ రావు హైకోర్టును ఆశ్రయించారు.
సీసీఎస్‌కు జమ చేయాలి... సొంత అవసరాలకు వాడుకోవద్దు : ఆర్టీసీ అధికారులకు హైకోర్టు ఆదేశం
ప్రతి నెలా సిబ్బంది వేతనం నుంచి తీసుకున్న నిధులను ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘాని(సీసీఎస్)కి జమ చేయాలనీ, ఆర్టీసీ వాటిని తన సొంత అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని అధికారులను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ సొసైటీ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటోందనీ, కోలుకోలేని నష్టాన్ని ఉందని గుర్తుంచుకోవాలని ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. సీసీఎస్‌కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి. ఈ సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తానికి సంబంధించి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ సీ.వీ.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఏ.కే.జయప్రకాశ్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగుల నుంచి ప్రతి నెలా నిధులు సేకరిస్తున్నారు. వారి జీతాల నుంచి కట్ చేసిన మొత్తాన్ని సీసీఎస్ ఖాతాలో జమ చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. అలా కాకుండా ఆర్టీసీ వాటిని వాడుకుంటోందనీ, ఇది సరికాదని నివేదించారు. ప్రతివాదుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిధుల విడుదల విషయంలో ప్రభుత్వంతో ఆర్టీసీ ఎండీ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతినెలా నిధులు జమచేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.
అధికారులకు నోటీసులు
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతోపాటు పలువురిని పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.
జస్టిస్ తొట్టతిల్ బి.ఎన్.రాధాకృష్ణన్‌కు నివాళి
తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి హైకోర్టు చివరి సీజే జస్టిస్ తొట్టతిల్ బి.ఎన్.రాధాకష్ణన్కు హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. ఏప్రిల్ 3న ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు ఫుల్‌కోర్టు సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కీలక తీర్పులను, అవి సమాజంపై చూపిన ప్రభావాన్ని ఏజీ బీఎస్ ప్రసాద్ వివరించారు. రాధాకృష్ణన్ సేవలు ఎప్పటికి గుర్తుండిపోతాయని సీజే ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు.