Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమల్లోకి సెల్ఫ్ మీటరింగ్
- హన్మకొండలో ప్రయోగాత్మకంగా అమలు
- సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రతినెలా కరెంటు మీటర్ రీడర్ ఇంటికొచ్చి రీడింగ్ తీసి బిల్లు ఇచ్చి వెళ్తారు. ఆ తర్వాత వినియోగదారులు నేరుగానో లేక ఆన్లైన్లోనే బిల్లు చెల్లిస్తారు. ఇప్పుడు ఈ పద్ధతికి స్వస్తి చెప్పి, మీటర్ రీడింగ్ బాధ్యతను వినియోగదారుడిపైనే పెట్టే ప్రయత్నానికి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సిద్ధపడుతున్నాయి. కరోనా సమయంలో తీసుకొచ్చిన సెల్ఫ్ మీటరింగ్ విధానాన్ని సాంకేతికంగా మరింత ఆధునీకరించి ఇప్పుడు నేరుగా అమల్లోకి తేనున్నారు. దీనికోసం హన్మకొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు. ఇక్కడ సక్సెస్ అయితే ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లో పూర్తిగా, ఆ తర్వాత దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లోనూ అమల్లోకి తెచ్చి, దీన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలని యోచిస్తున్నారు. సెల్ఫ్ మీటరింగ్ యాప్‌ను మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని, ప్రతినెలా దానిద్వారా వినియోగదారుడే మీటర్ రీడింగ్ తీసుకొని, అప్పటికప్పుడే బిల్లు చెల్లించే అవకాశాలు కల్పించారు. దీనికోసం వినియోగదారులకు అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు మీటర్ రీడర్లుగా పనిచేసిన వారిని తొలగించబోమనీ, ఇతర పనులకు వారిని ఉపయోగించుకుంటామని డిస్కంల ఉన్నతాధికారులు చెప్తున్నారు. తొలుత 500 యూనిట్లు పైగా వినియోగంలో ఉండే గృహ వినియోగదారులకు దీనిపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆ తర్వాత దశలవారీగా ఇతర వినియోగదారులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీటర్ రీడింగ్ తీయడంలో ఆలస్యం జరిగితే కేటగిరీలు, శ్లాబు రేట్లు మారి కరెంటు బిల్లులు అధికంగా వస్తున్న విషయం తెలిసిందే. సెల్ఫ్ మీటర్ రీడింగ్ బాధ్యతను వినియోగదారుడికే కట్టబెడ్తే, 30 ఆపై రోజుల మీటర్ రీడింగ్‌కు అతడినే బాధ్యుడ్ని చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా బిల్లింగ్‌లో తప్పులు దొర్లితే, వాటిని కేస్ టు కేస్ పరిష్కారం చేసుకోవచ్చని విద్యుత్ పంపిణీ సంస్థలు భావిస్తున్నాయి.
బిల్లింగ్‌లో కచ్చితత్వం ఉంటుంది
సెల్ఫ్ మీటర్ రీడింగ్ ద్వారా కరెంటు బిల్లుల్లో ఖచ్చితత్వం పెరుగుతుంది. దీన్ని హన్మకొండలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నాం. అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలున్నాయి. ఈ విధానాన్ని వరంగల్‌లో 2020 మే నెలలో కోవిడ్ టైంలో అమలు చేశాం. మంచి ఫలితాలు వచ్చాయి. దీనికి సంబంధించిన యాప్‌ను మరింత ఆధునీకరించాము. డిస్కం పరిధిలో 36 లక్షల మంది వినియోగదారులకు (84 శాతం) ఆండ్రాయిడ్ బిల్లింగ్ ద్వారా చేస్తున్నాం. తొలుత హైవాల్యూ వినియోగదారులకు సెల్ఫ్ మీటర్ రీడింగ్‌ను ప్రవేశపెడుతున్నాం. స్మార్ట్‌ఫోన్ సహాయంతో మీటర్ రీడింగ్ తీసి, అప్పటికప్పుడే బిల్లులు చెల్లించేయొచ్చు. దీనివల్ల డిస్కంకు మరింత త్వరగా బిల్లులు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధానంలో మీటర్ రీడింగ్‌లో తప్పులు దొర్లే అవకాశాలు కూడా తక్కువ.
- టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ ఏ గోపాలరావు.