Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరాబర్ ప్రతి గింజనూ కొంటాం
- రైతులను పీడించేది బీజేపీ.. బాగు కోరేది బీఆర్ఎస్
- ఆంధ్రా ప్రజలు తెలంగాణలో ఉంటామంటున్నారు : ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-జోగిపేట
రైతుల పంటలను కొనొద్దని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చెబుతోందని, కానీ రైతులు పండిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ కొంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతులను పీడించేది బీజేపీ అయితే.. రైతుల బాగు కోరేది బీఆర్ఎస్ అని అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేటలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆందోల్ మండలంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ పాల్గొని మాట్లాడారు. బోర్ల వద్ద మీటర్లు పెట్టి రైతులను బీజేపీ ప్రభుత్వం పీడిస్తున్నదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతుల కోసం ఉచితంగా 24 గంటల కరెంటును ఇస్తున్నదని తెలిపారు. తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారన్నారు. రైతులు అధైర్యపడొద్దని యాసంగికి సంబంధించి చివరి గింజను కూడా ప్రభుత్వమే కొంటుందని భరోసానిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఆంధ్రా ప్రజలు ఇక్కడే ఉంటామంటున్నారని తెలిపారు. అయితే ఏపీ మంత్రులు మాత్రం లేనిపోని కూతలు కూస్తు న్నారన్నారు. ప్రత్యేక హౌదా కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు వారు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జర్న లిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు మంత్రి అంద జేశారు. అలాగే, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ది దారులతో గృహ ప్రవేశాలు చేయించారు. చివరగా జోగిపేట పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.