Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాం కూడా ఇంత విధ్వంసం సృష్టించలేదు
- సీఎం కేసీఆర్ తీరుపై రేవంత్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాన్ని డీ9 (దావుద్9) గ్యాంగ్ కుప్ప చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. వారిలో ఎవర్ని వదిలేప్రస్తకే లేదని హెచ్చరించారు. నిజాం కూడా ఇంత విధ్వంసం సృష్టించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ చేస్తున్న విధ్వంసాన్ని మీడియా సాక్షిగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కేసీఆర్ కుటుంబం కోసమేనా? అని ప్రశ్నించారు.ఆ కుటుంబ స్వార్థానికి హైదరాబాద్ నగరాన్ని బలి చేస్తారా? అంటూ నిలదీశారు. తాను రాజకీయ విమర్శలు చేయడం లేదనీ, హైదరాబాద్ మహానగర భవిష్యత్ కోసమేనని చెప్పారు. నగరంలోని 100 కోట్ల విలువైన 2704 గజాల భూమిని రూ. 17 కోట్లకే కేసీఆర్ తీసుకున్నారని ఆరోపించారు. అదే భూమికి రూ. 40 కోట్లు ఇస్తే, తనకు ఇవ్వగలరా?అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే బెదిరించి ఆ భూములు తమ పేరిట రాయించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ భూదోపిడీ కోసం నిఘంటువులో కొత్త పదాన్ని సృష్టించాలని చెప్పారు. గతంలో గ్రేటర్ పరిధిలో కొన్ని నిబంధనలు ఉండేవనీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కుతున్నారని చెప్పారు. గత 60 ఏండ్లలో ఎప్పుడూ జరగని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నైసర్గిక స్వరూపం నేపథ్యంలో అక్కడ కొన్ని ప్రత్యేక నిబంధనలున్నాయని తెలిపారు. కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ నిజాం నవాబుల నుంచి హెరిటేజ్ భవనాన్ని కొనుగోలు చేసిందన్నారు. మొత్తం 7,416 గజాల భూమికి రోడ్డు వెడల్పులో పోను 6,900 గజాలు మిగిలిందని తెలిపారు. ఇందులో 1,200 గజాల గ్రీన్ బెల్ట్‌కు ఉందనీ, మిగిలిన 5,800 గజాలకు 60వేల చదరపు అడుగులకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ నమస్తే తెలంగాణ దామోదర్ రావుకు 2,704 గజాల భూమిని ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిందన్నారు. ఇందుకోసం ఆ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో ఇండ్ల నిర్మాణానికి, వ్యాపార సంస్థలకు ఐదు అంతస్థులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కేబీఆర్ పార్క్‌ను ఎకో టూరిజం, ఎకో సెన్సిటివ్ జోన్‌గా పరిగణిస్తారని తెలిపారు. అందుకే ఆ పార్క్ పరిసరాల్లో కమర్షియల్ భవనాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు.
ఐదు అంతస్థుల కంటే ఎక్కువ అనుమతి ఇవ్వవద్దనే నిబంధనలు న్నాయని పేర్కొన్నారు. కానీ భూమి రాసిచ్చిన తర్వాత సంస్థకు నాలుగు అంతస్తులు భూమి లోపల, 16 అంతస్తులను భూమిపై కట్టు కునేలా అను మతులు ఇచ్చారని విమర్శిం చారు. నమస్తే తెలంగాణకు కేసీఆర్ యజమాని, అందుకే నిబంధనలకు విరుద్ధంగా 4,78,825 చదరపు అడుగులమేర నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు. మూడువేల గజాల్లోనే ఇలాంటి అనుమతులు ఇస్తే...కేబీఆర్ పార్కు జంక్షన్లో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. పర్యావరణ పరంగా పార్కు పరిస్ధితి ఏమిటి? ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు ఎకరాల్లో ఉన్న బసవతారకం ఆస్పత్రికి కూడా మూడు అంతస్థులకు మించి అనుమతులు ఇవ్వలేదని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నా అప్పటి పాలకులు విధ్వంసం సృష్టించలేదని వివరించారు.
చీమలపాడు అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి
ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్ని ప్రమాదం సంఘటనపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలకు ముగ్గురు పేదలు అగ్నికి ఆహుతి అయ్యారని తెలిపారు. గాయపడిన వారికి అత్యున్నత వైద్యసేవలు అందించాలని కోరారు. వారి కుటుంబాలను బీఆర్ఎస్ అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ప్రజల పాలిట శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి బీఆర్ఎస్ను డిమాండ్ చేశారు. గాయపడిన వారికి రూ.25 లక్షలు ఇవ్వడంతో పాటు ఉచిత వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటనకు కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.