Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీమలపాడు బీఆర్ఎస్ సభా స్థలి సమీపంలో మంటలు
- బాణసంచా గుడిసెపై పడటంతో పేలిన గ్యాస్ సిలిండర్
- నలుగురు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు
- మంత్రి అజరు, ఎంపీ నామాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోన్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ కారేపల్లి
'రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు' వారివి. గ్రామంలో బీఆర్ఎస్ సభ పెడుతున్నారంటే మహిళలు కూలికి పోగా.. పురుషులు ఇండ్ల వద్దే ఉన్నారు. సభా అనంతరం కూలికి వెళ్దామని ఆగిపోయారు. ఎంపీ నామ నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతుం డటంతో కార్యకర్తలు టపాసులు, బాణసంచా కాల్చారు. ఓ బాణసంచా ఎగిరి సమీపంలోని ఓ గుడిసెపై పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సభకు వచ్చిన వారు, పోలీసులు కలిసికట్టుగా మంటలు ఆర్పే పనిలో పడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో సభ ప్రారంభిద్దామని ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర నాయకులు వేదికపైకి చేరారు. ఇంతలోనే భారీ విస్ఫోటనం. ఓవైపు ఎండ, మరోవైపు గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ మంటలతో పేలింది. దాని అడుగుభాగం పూర్తిగా దెబ్బతింది. తునాతునకలైన బండ రేకులతో, సిలిండర్ వంద మీటర్ల మేర తారా జువ్వలా దూసుకెళ్లింది. సమీపంలో ఉన్నవారికి రేకుముక్కలు తగలటంతో శరీరవయాలు తెగిపోయాయి. కొందరి పాదలు మొదలు నడుం వరకు, కాళ్లు ఎక్కడికక్కడ ముక్కలయ్యాయి.
నలుగురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం
ఈ ఘటనలో చీమలపాడుకు చెందిన అజ్మీర మంగు (42), స్టేషన్ చీమలపాడుకు చెందిన బాణోత్ రమేష్(37)కు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరితో పాటు మరో ఆరుగురికి కాళ్లు తీవ్రంగా దెబ్బతినడంతో హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో అజ్మీర మంగు మృతిచెందగా.. బాణోత్ రమేష్ ఆస్పత్రికి చేరిన కొద్దిసేపటికి మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన వలస కూలి సందీప్(35) రెండు కాళ్లు తెగిపోయాయి. ఎడుమకాలు పూర్తిగా తెగిపోగా.. మరో కాలు ఛిద్రం అయింది. కాలులో నరాలు కట్ కాలేదని, కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బుధవారం రాత్రి హైదరాబాద్ తరలించారు. వీరిలో గేటు కారేపల్లికి చెందిన ధర్మసోత్ లక్ష్మణ్, తడికలపూడికి వాసి తేజావత్ భాస్కర్ (35) పరిస్థితి మరింత విషమంగా ఉందని, కాళ్లలో నరాలు పూర్తిగా కట్ కావడంతో రక్తస్రావం ఏమాత్రం ఆగడంలేదని, అందుకే హైదరాబాద్ తరలించినట్టు వైద్యులు తెలిపారు. కాగా, మార్గమధ్యలో లక్ష్మణ్ (55) మృతి చెందాడు. వెంకిట్యాతండాకు చెందిన విలేకరి అంగోత్ కుమార్ ఎడమకాలు తెగింది. సీఐ కారు డ్రైవర్ నవీన్ కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్టు సీపీ విష్ణు ఎస్ వారియర్ ధ్రువీకరించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఆస్పత్రిలోని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురికి వైద్యమందిస్తున్నట్టు చెప్పారు.
ఘటనాస్థలిలో రక్తపుటేరులు..
గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనాస్థలిలో రక్తపుటేరులు పారాయి. తెగిపడిన శరీరావయాలతో ఆ ప్రాంతం రక్తపు ముద్దలతో నిండిపోయింది. తీవ్రమైన బాంబు విస్ఫోటనాన్ని తలపించేలా రక్తసిక్తంగా మారింది. వేగంగా దూసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ ఇనుప రేకులు కాళ్లు, కడుపుల్లోకి దిగడంతో శరీరావయాలు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. ఓ విలేకరి కాలు పాదం తెగిపోయి ఘటనాస్థలిలో కనిపించింది. యుద్ధభూమిని తలపించేలా ఉన్న ఈ భయానక వాతావరణాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగ్రాతులను ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్తుండటంతో తమ కుటుంబ సభ్యుల కోసం ఆర్తనాదాలు చేశారు. వారి వెంటే జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరిన కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి వాతావరణం హృదయవిదారకంగా మారింది. భాస్కర్ భార్య కన్నీరుమున్నీరై విలపిస్తూ తనకు నాలుగేండ్ల కుమారుడని, నా భర్త చనిపోతే నేను కూడా ఇక్కడే చచ్చిపోతానని కన్నీరుమున్నీరై విలపిస్తుండటంతో అక్కడున్న వారు చలించిపోయారు.
కాన్వారులోనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి...
ఊహించని ఘటన చోటుచేసుకోవడంతో సభా వేదిక పైనున్న ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములునాయక్, ఇతర నాయకులు సభా స్థలికి అతి సమీపంలో సిలిండర్ పేలిన చోటికి వచ్చారు. కొంతసేపు భయాందోళనకు లోనైనా.. వెంటనే పోలీసు, కార్యకర్తల సహాయంతో క్షతగాత్రులను తమ కాన్వారులోనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యసేవలు వెంటనే అందేలా డాక్టర్లను అప్రమత్తం చేశారు.
మంత్రి కేటీఆర్ ఫోన్... మృతులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా
మేరకు పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీ నామ, ఎమ్మెల్యే రాములునాయక్, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనంలో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల తమ అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, క్షత గాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే నామ ముత్తయ్య ట్రస్టు తరఫున మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారాన్ని ఎంపీ నామ ప్రకటించారు. విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మృ తుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగ్రాతు లకు రూ.లక్ష చొప్పున ఆర్థికసహాయం ప్రకటించారు. మూడు రోజులు సంతాపదినాలు ప్రకటించారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: సీపీఐ(ఎం)
మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే నున్నా నాగేశ్వరరావు, నాయకులు.. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించారు. స్పృహలో ఉన్నవారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని అవసరమైతే హైదరాబాద్ తరలించాలని కోరారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఓదార్చారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కాళ్లు తెగిన వారికి రూ.50 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.20 లక్షలు చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.