Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన బతుకమ్మ చీరల యూనిట్లు, ఆర్డర్లు
- మళ్లీ మొదలైన చీరల ఉత్పత్తి ొ గర్శకుర్తిలో సాంచెల సవ్వడి
నవతెలంగాణ-గంగాధర
వస్త్రోత్పత్తికి అవసరమైన ముడి సరుకు ధరలు ఆకాశాన్నంటాయి.. నేసిన బట్టలకు గిరాకీ లేక.. పనుల్లేక బతుకుపై భరోసా కోల్పోయిన చేనేత కార్మికుల్లో బతుకమ్మ చీరలు జీవం పోశాయి.. నిన్న, మొన్నటి వరకు స్కూల్ యూనిఫామ్స్, రంజాన్ గుడ్డ ఉత్పత్తిపై దృష్టి సారించిన నేతన్నలు నేడు బతుకమ్మ చీరల తయారీలో నిమగమయ్యారు. ఈయేడు కొత్తగా స్కూల్ యూనిఫామ్స్, రంజాన్ గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లతో ఏడాదంతా నేతకార్మికుల చేతికి పని దొరికింది. ఒకప్పుడు బతుకుదెరువు కోసం భీవండి, షోలాపూర్, సూరత్ వంటి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి బతికిన ఇక్కడి నేతన్నలు బతుకమ్మ చీరల ఉత్పత్తితో ఉన్న ఊళ్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి వలసలకు స్వస్తి పలికారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామం చేనేత, పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమలకు అడ్డా. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తర్వాత స్థానంలో వేళ్లూనుకుని ఉన్న ఈ గ్రామంలో వస్త్రోత్పత్తిపై ఆధారపడి 6 వేల చేనేత కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒకప్పుడు పనులు లేక అవస్థలు పడిన నేతన్నలకు ఇప్పుడు చేతినిండా పని లభించింది. ఈ గ్రామంలో నేడు ఏ దిక్కు చూసినా సాంచెల సవ్వడే వినిపిస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వం నుంచి బతుకమ్మ చీరల ఆర్డర్లను ఇప్పించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు అందించే ప్రతి గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లను గర్శకుర్తికి వర్తించేలా ప్రత్యేక చొరవ చూపారు. దీంతో ఐదేండ్లుగా ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు కల్పిస్తుండగా, ఈ యేడు కొత్తగా స్కూల్ యూనిఫామ్స్, రంజాన్ గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చింది. దీంతో చేనేత వ్యాపారులు, ఆసాములు, కార్మికుల్లో ధీమా నెలకొంది.
ఏడాదంతా పనులే ..
ఫిబ్రవరి నుంచి షురూ అయ్యే బతుకమ్మ చీరల ఉత్పత్తి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. పవర్ లూమ్స్‌పై 8 నెలలు బతుకమ్మ చీరల ఉత్పత్తి నిర్విగంగా కొనసాగగా, మరో 4 నెలలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులకు ఉచితంగా అందించే స్కూల్ యూనిఫామ్స్, రంజాన్ గుడ్డ ఉత్పత్తికి సర్కారు ఆర్డర్లను కల్పించింది. గత ఏడాది 20 లక్షల మీటర్ల చీరల ఉత్పత్తికి అర్డర్లు కల్పించగా, ఈ యేడు 32 లక్షల 26 వేల 750 మీటర్ల చీరల తయారీకి ఆర్డరు ఇచ్చింది. ఈ యేడు కొత్తగా 2 లక్షల 13 వేల 860 మీటర్ల స్కూల్ యూనిఫామ్స్, 24 వేల మీటర్ల రంజాన్ గుడ్డ ఉత్పత్తికి కూడా ఆర్డర్లు ఇచ్చింది. గత యేడు 17 స్మాల్ స్కేల్ ఇండిస్టీస్ (ఎస్ఎస్ఐ) యూనిట్లు ఉండగా, ఈ యేడు మరో 16 కొత్త యూనిట్లకు ఆర్డర్లు కల్పిస్తోంది. మొత్తం 33 ఎస్ఎస్ఐ యూనిట్లు చేరగా, సుమారు 945 పవర్‌లూమ్స్‌పై గుడ్డ ఉత్పత్తి కానుంది.
కలర్ చీరలకు స్వస్తి.. బతుకమ్మ చీరలపైనే దృష్టి
ప్రభుత్వం ఇక్కడి పవర్ లూమ్స్‌కు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వక ముందు విరివిగా కలర్ చీరలు, టవల్స్ ఉత్పత్తి అయ్యేవి. యారన్, ముడి సరుకు ధరలు విపరీతంగా పెరగ్గా, మార్కెట్లో కలర్ చీరలకు డిమాండ్ లేకుండా పోయింది. దీంతో గ్రామంలో కలర్ చీరలు, టవల్స్ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది.
చితికిన బతుకులకు భరోసా
సుంకె రవిశంకర్- చొప్పదండి ఎమ్మెల్యే
పనులు లేక పస్తులతో చితికిపోయిన చేనేత కుటుంబాలకు బతుకమ్మ చీరల ఆర్డర్లతో బతుకుపై భరోసా కల్పించాం. గర్శకుర్తిలో సాంచెల సవ్వడికి బదులు చావు డప్పు మోగింది. ఆత్మహత్యలు, ఆకలి చావులను ఆశ్రయించిన నేతన్నలు ఇప్పుడు గడ్డు పరిస్థితుల నుండి గట్టెక్కారు. పనులు లేక కుదేలైన పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమలకు ఐదేండ్లుగా జీవం వచ్చింది. బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫామ్స్, రంజాన్ గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు కల్పిస్తున్నాం. ప్రతి వ్యాపారి, ఆసామి, కార్మికుడికి ఏడాది మొత్తం పని కల్పిస్తున్నాం.
సర్కారు ఆర్డర్లతో ధీమాగా ఉన్నాం ..
అలువాల విఠోభ- వ్యాపారుల సంఘం అధ్యక్షుడు- గర్శకుర్తి
బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫామ్స్, రంజాన్ గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లతో ధీమాగా బతుకుతున్నం. మా బాధలు గ్రహించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర పవర్ లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి ఆర్డర్లు వచ్చేలా కృషి చేశారు. ఈ యేడు 33 ఎస్ఎస్ఐ యూనిట్లకు 32 లక్షల 26 వేల 750 మీటర్ల బతుకమ్మ చీరల ఉత్పత్తికి ఆర్డరు లభించింది. నిన్న, మొన్నటి వరకు స్కూల్ యూనిఫామ్స్, రంజాన్ గుడ్డను ఉత్పత్తి చేయగా, నేడు చీరల తయారీపై దృష్టి పెట్టాం.
వలసలకు స్వస్తి చెప్పాం
వడ్లకొండ పెంటయ్య- పవర్ లూమ్స్ యజమాని- గర్శకుర్తి
ప్రభుత్వ కల్పించిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో వలస పోవడం బందైంది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక గతంలో బీవండి, షోలాపూర్, సూరత్ వంటి ఇతర రాష్ట్రాలకు కుటుంబాలను వదిలి వలస వెళ్లి ఎంతో గోస పడ్డం. ఇప్పుడు సర్కార్ ఉన్న ఊళ్లోనే ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాం.
ఏడాదంతా పని మిట్టపల్లి రమేశ్ - చేనేత కార్మికుడు : గర్శకుర్తి
ప్రభుత్వం కల్పించిన బతుకమ్మ చీరల తయారీతోపాటు స్కూల్ యూనిఫామ్స్, రంజాన్ గుడ్డ ఉత్పత్తితో ఏడాదంతా పని దొరుకుతుంది. రోజుకు రూ.800 కూలి గిట్టుబాటు అవుతుంది.