Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగాజమునా తెహజీబ్ సంస్కృతి విశిష్టమైనది : ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గంగా జమునా తెహజీబ్ సంస్కృతి ఎంతో విశిష్టమైనదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ దేశం మనందరిదనీ, దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందామన్నారు. ఈ పోరాటంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు న్యాయమే గెలుస్తుందని నొక్కి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం చిన్నారులకు కేసీఆర్ రంజాన్ కానుకలు అందించారు. వారితో ఇంగ్లీష్‌లో ముచ్చటించారు. ఉన్నతస్థితికి ఎదగాలని దీవించారు. వేదికపై తనతో పాటు ఉన్న పలువురికి ఇఫ్తార్ విందును అందించి రోజాను విరమింపజేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్ల కింద అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణ నేడు అన్నింటిలోనూ ముందు వరుసలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో తాగు, సాగు నీటి, కరెంటు సమస్యల్ని పరిష్కరించుకున్నామన్నారు. తలసరి ఆదాయంలో మన రాష్ట్రమే దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రమేర్పడిన కొత్తలో తలసరి విద్యుత్ వినియోగం 1000-1050 యూనిట్లు ఉంటే నేడది రెండింతలు పెరిగి 2100 యూనిట్లకు పెరిగిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేండ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమేననీ, టీఆర్ఎస్ ప్రభుత్వమొచ్చాక రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ, తదితరుల విజ్ఞప్తి మేరకు అనీస్ ఉల్ గుర్బాను అత్యద్భుతంగా నిర్మించుకున్నామన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఇప్పుడు లేవన్నారు. వలసెళ్లినవారు కూడా తిరిగి ఊర్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగ సమస్యను కూడా మెల్లమెల్లగా తగ్గిస్తున్నామని చెప్పారు. మనం ముందుకు సాగుతున్నాంగానీ దేశం వెనుకబడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా కేంద్రం కూడా శ్రమిస్తే దేశ జీడీపీ మరో 3, 4 శాతం పెరిగేదని చెప్పారు. దేశం అగమ్యగోచర స్థితిలో పయనిస్తున్నదనీ, ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నొక్కి చెప్పారు. దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చామనీ, మహారాష్ట్ర ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఈ ఇఫ్తార్ విందులో మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మండలి వైస్ చైర్మెన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బి.సుభాష్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మైనార్టీ వ్యవహారాల సలహాదారులు ఏకే.ఖాన్, మైనార్టీ వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ షఫీఉల్లాఖాన్, టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు, ముస్లిం మతపెద్దలతో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు.