Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- (K)కాలువలు.. (C)చెరువులు.. (R)రిజర్వాయర్లు..
- వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం :మంత్రి కేటీఆర్
- మంత్రి నిరంజన్‌రెడ్డి, స్పీకర్ పోచారంతో కలిసి వ్యవసాయ కళాశాల భవనాలు ప్రారంభం
నవతెలంగాణ - తంగళ్ళపల్లి
'కే అంటే కాల్వలు.. సీ అంటే చెరువులు.. ఆర్.. అంటే రిజర్వాయర్లు' అని కేసీఆర్ పేరుకు మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని కాళేశ్వరం, సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి స్వరాష్ట్రంలో పండుగగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో బుధవారం వ్యవసాయ కళాశాలను, రైతుల కోసం ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్‌ని మంత్రి నిరంజన్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశాదిశా చూపుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కొందరు మాట్లాడుతున్నారని.. వారు తెలిసి మాట్లాడుతున్నారా.. తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమానికి హెలికాప్టర్లో వస్తున్నప్పుడు వరుసగా ఉన్న కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్ మానేరు నీళ్లతో కళకళలాడుతుంటే ఎంతో సంబురంగా అనిపించిందని చెప్పారు.పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక సదుపాయాలు, సాంకేతిక పద్ధతులతో కూడిన వ్యవసాయ కళాశాల దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా నిలుస్తుందని చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో పండిన ధాన్యమే కరువు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారంగా పంపిణీ అవుతుండటం మనందరికీ గర్వకారణం అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో కోటీ 8లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, కేసీఆర్ ప్రత్యేక చొరవతో అది రెండు కోట్లా 30లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు. భూగర్భ జలమట్టం పెరగడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ముస్సోరీలోని శిక్షణ ఐఏఎస్‌లకు పాఠంగా మారడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ బోయినిపల్లి వినోద్ కుమార్, సిరిసిల్ల జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు.