Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికవర్గానిదే
- సామాజిక న్యాయ సాధనకు సమైక్య పోరాటాలు
- జాతీయోద్యమ నినాదాలే మౌలికాంశాలు
- 'అంబేద్కర్-రాజ్యాంగం-సామాజిక న్యాయం' సెమినార్లో బీవీ.రాఘవులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'రాజ్యాంగం ఉంటేనే కార్మికులకు హక్కులు ఉంటాయి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉంది. సామాజిక న్యాయ సాధనకు సమైఖ్య పోరాటాలు నిర్వహించాలి. అంబేద్కర్ వారసులం మేమే అంటూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రచారం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితిల్లోనూ అంబేద్కర్ వారసత్వాన్ని కబ్జా కానివ్వం. ఆయన వారసత్వాన్ని కార్మికులు పుణికిపుచ్చుకోవాలి. రాజ్యాంగంలో మౌలిక అంశాలను ప్రతిపాదించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుంది' అనిసీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బీవీ.రాఘవులు అన్నారు. అంతకుముందు లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి సీఐటీయూ రాష్ట్ర నాయకులు పూలమాలలేసి నివాళలర్పించారు. అక్కడి నుంచి బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు 'వాక్ ఫర్ సోషల్ జస్టీస్' పేరుతో 10కే రన్ నిర్వహించారు. అనంతరం కార్మికోద్యమ నిర్మాత బీటీ రణదివే వర్థంతి సందర్భంగా ఈనెల 6 నుంచి అంబేద్కర్ జయంతి అయిన 14 వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన నిర్వహించిన 'అంబేద్కర్-రాజ్యాంగం-సామాజికన్యాయం' సెమినార్లో రాఘవులు మాటాడారు. రాజ్యాంగానికి, అంబేద్కర్‌కు అవినాభావ సంబంధముందని అన్నారు. రాజ్యాంగాన్ని రచించాలనే గొప్ప ఆశయం కోసం ఆయన జీవితాన్నే అంకితం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడానికి పోటిపడాలి తప్ప విగ్రహాలు పెట్టడానికి కాదని, కేసీఆర్ 125 అడుగుల విగ్రహం పెడితే మహారాష్ట్రలో మోడీ 350అడుగుల విగ్రహానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. సీఐటీయూ అధికారం కోసమో? ఓట్ల కోసమో కాకుండా దీర్ఘకాలిక లక్ష్యం కోసం కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. సామాజిక న్యాయం సిద్ధిస్తేనే కార్మికులకు హక్కులు, కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు వస్తాయని వివరించారు. అంబేద్కర్ మార్గాన్ని అనుసరించని బీజేపీ-ఆర్ఎస్ఎస్, మనువాదులు ఆయన వారసులమని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆయన్ను హిందూ సంస్కరణవాదిగాను చిత్రీకరిస్తున్నారని, బౌద్ధమతం హిందూమతంలో భాగమేనంటూ అబద్దాలు, అభూత కల్పనలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అయితే అదే అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని తగులబెట్టారని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని మౌలిక అంశాల ప్రతిపాదనలతోపాటు వాటికి రూపాన్ని ఇవ్వడం, మార్గదర్శకానికి ప్రాధాన్యత ఉందని వివరించారు. జాతీయోద్యమ కాలంలో ప్రజలను ఒప్పించి, మెప్పించడానికి ముందుకొచ్చిన అంశాలైన ప్రజాస్వామ్య పరిపాలన, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, లౌకికతత్వం, సమాఖ్య విధానం, భాషాప్రయుక్త రాష్ట్రాలు, సామాజిక న్యాయం వంటివాటిని రాజ్యాంగంలో చేర్చారని గుర్తుచేశారు. మహిళలకు ఆస్తిలో హక్కులు, నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించేందుకు అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూకోడ్ బిల్లును అమలుకాకుండా ఆనాటి పాలకులు అడ్డుకున్నారని తెలిపారు. దానికి నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జాతీయోద్యమ నినాదాలకు, రాజ్యాంగ విలువలను ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకుందని, ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్తిరపర్చడానికి గవర్నర్లు పెత్తనం చెలాయిస్తున్నారని, ఇలాంటి చర్యలు దేశవిచ్ఛిన్నానికి దారితీస్తాయని హెచ్చరించారు. మహిళల వేషాధారణ శూర్పణల్లాగా ఉందని ఓ బీజేపీ నేత అనడం హస్యాస్పదంగా ఉందంటూ, అసలు శూర్పణలను తయారుచేసింది మనుధర్వశాస్త్రమే కదా అని విమర్శించారు. కేరళలో గతంలో రవికల పోరాటం నడిచిందని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్, మనువాదులను మహిళలను అనుమానిస్తున్నారని, ఏం తినాలో? ఏలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై శాసిస్తున్నారని, సంస్కార భారతిపేరుతో వైద్య వృత్తిని హైజాక్ చేస్తున్నారని వివరించారు. కులవ్యవస్థ నాశనం అయితేనే సమాజంలో సమూల మార్పులు వస్తాయని తెలిపారు. కుల, మతవాదాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఆర్థిక దోపిడి, సామాజిక అణిచివేతపై పోరాటం చేయడానికి కార్మికవర్గం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ సాధనకు సంఘటిత పోరాటాలు నిర్వహించాలని అన్నారు. కార్మికవర్గంలో సామాజిక న్యాయం కోసం రణదివే ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక దళితులపై దాడులు పెరిగాయని, కులదురంహాకార హత్యలు పెరిగాయని తెలిపారు. కర్ణాటకలో దళిత మహిళ బావిలో నీళ్లు తాగిందనే కారణంతో అగ్రవర్ణాలు ఆ బావిలో ఆడపేడ, మూత్రం కలిపారని గుర్తుచేశారు. దీనికి ప్రతిఘటనగా దళిత యువకులు అన్ని బావుల్లో నీళ్లు తాగి ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారని తెలిపారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లులక్ష్మి మాట్లాడుతూ మహిళలు మాంసం తింటే లైంగిక కోరికలు పెరుగుతాయని, నిబద్ధత లోపిస్తుందంటూ రాజస్తాన్‌లో బీజేపీ నేతలు అనడం అవమానకరంగా ఉందన్నారు. గోరక్షక దళాల దాడులు, కర్ణాటకలో హిజాబ్ అంశం పేరుతో మనువాదులు మహిళలను కించపరుస్తున్నారని తెలిపారు. అవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ వైవిధ్యాన్ని ధ్వంసం చేయడానికే ఆర్ఎస్ఎస్శక్తులు మనుధర్మశాస్త్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడానికి బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్ మాట్లాడుతూ ఆదివాసీలు, గిరిజనులను మనువాదులు హిందువులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఝార్ఖండ్‌లో గిరిజనులు హిందుమతానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. తాము ఏ మతంకాదు.. ప్రకృతి ఆరాధీకులమంటూ చెప్పకుంటున్నట్టు గుర్తుచేశారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం క్యాంపెయిన్‌కు సంఘీభావ నిధిగా సంగారెడ్డిలోని శాండ్విక్ కంపెనీ కార్మికులు రూ.14,900, పశుమిత్రల సంఘం నుంచి రూ.5,200 విరాళంగా అందజేశారు. అందకార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు ఎస్వీ.రమ, జె.వెంకటేష్, శ్రీకాంత్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మనాయక్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షకార్యదర్శులు జె.కుమారస్వామి, ఎం.వెంకటేష్, గ్రేటర్ హైదరాబాద్ సౌత్ సిటీ అధ్యక్షులు శ్రావణ్‌కుమార్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి జె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.