Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటకెక్కిన అటవీ ఉత్పత్తుల కొనుగోలు
- చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
- కష్టపడి సేకరించినా.. కొనేవారేరి?
- దళారుల చేతిలో మోసపోతున్న గిరిజనులు
నవతెలంగాణ-నసురుల్లాబాద్
అటవీ ఉత్పత్తులు సేకరించి పొట్ట పోసుకునే జీవితాలు నేడు దుర్భరంగా మారాయి. అటవీ ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా చేతులెత్తేయడంతో అటవీ ఉత్పత్తుల సేకరణ తప్ప మరో పని తెలీని గిరిజనులు, కూలీలు కుటుంబపోషణ భారంగా మారింది. దాంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు సగానికి సగం ధర చెల్లిస్తూ నిలువునా దోచుకుంటున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ ధన్ యోజన పథకం నీరుగారిపోయింది.
పొట్ట కోసం 'లక్క' తిప్పలు..
అటవీ ఉత్పత్తుల సేకరణ, సేకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు తీసుకొచ్చిన వన్ ధన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. మూడేండ్ల నుంచి పథకాన్ని అమలు చేయకుండా నిలుపుదల చేసింది. ఉత్పత్తులను సేకరించేవారు లేక కొనుగోలు చేయక పోవడంతో గిరిజనులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి బోధన్ వెళ్లే రహదారి పక్కనున్న పెద్ద పెద్ద చెట్ల నుంచి గిరిజనులు లక్కను సేకరిస్తుంటారు. బాన్సువాడ, నసురుల్లాబాద్ మండల అటవీ ప్రాంతంలో ఎండిపోయిన చెట్ల నుంచి కొన్నేండ్లుగా రైతుకూలీలు లక్కను సేకరిస్తున్నారు. లక్క ఉత్పత్తులను సేకరించడం అంత సులువైందేమీ కాదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అంత కష్టపడి లక్కను సేకరించినా దక్కేది మాత్రం అంతంతే. ఇతర రాష్ట్రాల్లో లక్క కేజీ రూ.800 నుంచి రూ.1000 ఉండగా మన రాష్ట్రంలో దళారులు కేజీ లక్కకు రూ. 200 నుంచి రూ.300 మాత్రమే చెలిస్తున్నారు. లక్కను ప్రభుత్వం కొనుగోలు చేస్తే రూ.800 వస్తాయని కూలీలు చెబుతున్నారు. మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి లక్కను కొనుగోలు చేస్తుంటారు.
వ్యవసాయం లేక లక్క సేకరణ
వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కూలీ లకు వ్యవసాయం పనులు లేకపోవడంతో వారూ లక్కను సేకరిస్తున్నారు. అటవీ ప్రాంతంలో లభించే ఆటవీ సంపదతతో రైతు కూలీలకు ఉపాధి లభిస్తుంది. గతంలో అటవీ సంపదపై వారికి అవగాహన కల్పిస్తూ, వారు సేకరించిన అటవీ సంపదను ప్రభుత్వమే ఐకేపీ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించేది. దాంతో గిరిజన, గ్రామీణ ప్రాంతాల వాసులు గానుగ, వేప, ఇప్ప గింజలు, ఇప్ప పువ్వు, రబ్బరును సేకరించి ఉపాధి పొందారు. కాగా, మూడేండ్లుగా రైతుకూలీలు సేకరించిన అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం నిలిపేసింది. దాంతో దళారులను ఆశ్రయించి వారు చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
ఔషధ మొక్కలపై చిన్నచూపా..?
గ్రామీణ ప్రాంతాల్లో పెరటి తోటలో, ఇంటి ఆవరణంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు పెంచినా కొనే వారు ఎక్కడ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఔషధ మొక్కల కొనుగోలు చేయడానికి జిల్లాస్థాయిలో ప్రత్యేక మార్కెట్లు ఉన్నాయి. జిల్లాలో మాత్రం ఔషధ మొక్కలు కొనే వారే కరువయ్యారు. ఇంటి వద్ద కలబంద, వేపగింజలు, నేల ఉసిరి, తెల్ల ఆముదం, కానుగ, గన్నేరు, గోరింట, తంగేడు, తురక వేప, సరస్వతి ఆకు, తదితర ఔషధ గుణలు ఉన్న మొక్కలు పెంచినా కొందరికి వాటి విలువ తెలియక కత్తిరించి పారేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో అధికంగా అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ కానుగ, వేప, ఉసిరి, చింత, నేరేడు, లక్క, మారేడు, కర క్కాయ, తానికాయ తదితర అటవీ ఉత్పత్తులు లభిస్తాయి.
లక్కతో ఉపయోగాలు
మనం వాడే మాత్రలు ఎక్స్పెయిరీ డేట్లోగా పాడవకుండా, ఫంగస్ ఏర్పడ కుండా కాపాడటంలో లక్క పూత కీలకం. నాణ్యమైన లక్కను మాత్రలపై పూతగా వేస్తారు. కొన్ని దేశాల్లో ఆహారపదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచి తింటారు. అవి పాడవకుండా లక్క రంగు కలిపి పూత వేస్తారు. గోళ్ల రంగు, బూటు పాలి ష్లోనూ వాడతారు. సిల్క్ వస్త్రాల తయారీ లోనూ లక్క వినియోగిస్తారు. రెడీమేడ్ బంగారు ఆభరణాలు, బాడీ స్ప్రేల్లోనూ వినియోగిస్తున్నారు.
కష్టపడి లక్క సేకరిస్తున్నం
మేము కొన్నేండ్లుగా లక్క సేకరిస్తున్నం. సేకరించిన లక్కకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాం. గతంలో బాన్సువాడలో కొనుగోలు కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు అవి లేకపోవడంతో దళారులే కొంటున్నారు. కిలోకు రూ.150 మాత్రమే ఇస్తున్నారు. వారు శుద్ధి చేసి తులాల చొప్పున విక్రయించి లాభం పొందుతున్నారు. ప్రభుత్వమే లక్కను కొనుగోలు చేస్తే మాకు ఉపాధి లభిస్తుంది.
- కడవాత్ అశోక్. మొగులన్పల్లి, బాన్సువాడ.