Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరీంనగర్ సీఐకి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ -హైదరాబాద్
కోర్టుధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని కరీంనగర్ సీఐ(కరీంగనర్-2) లక్ష్మీబాబుకి హైకోర్టు నోటీసులిచ్చింది. ఈ నెల 21న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ జరిగిన అన్ని వాయిదాలకు గైర్హాజరు అవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 2022, ఆగస్టు 10న ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు తనను చట్టవిరుద్ధంగా కరీంనగర్ సీఐ స్టేషన్లో ఉంచారనీ, చేయి చేసుకున్నారనీ, అసభ్యకరంగా మాట్లాడారంటూ నూగూరి వంశీకృష్ణ వేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ వినోద్‌కుమార్ విచారించారు. తాను చెప్పిన ఆ విషయాలన్నీ పీఎస్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయిందని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. అలాగే ఎలాంటి వారెంట్ ఇవ్వకుండా పోలీసులు పిటిషనర్ ఇంటిపై దాడి చేసి ఆస్తుల పత్రాలు తీసుకున్నారని తెలిపారు. పంచనామా, సీజ్ ప్రక్రియను పాటించలేదన్నారు. డాక్యుమెంట్లను కాల్చేస్తానని బెదిరించారన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయా తేదీలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని గతంలో ఆదేశించింది. అయినా సీఐ సమర్పించక పోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కరీంనగర్-2 పోలీస్ స్టేషన్లో సీసీటీవీలను నవంబర్‌లో ఏర్పాటు చేశా రని జీపీ వాదించారు. అయితే 2018లో సీసీ టీవీలు ఉన్న స్టేషన్‌గా కరీంనగర్-2ను పేర్కొం టూ మోడల్ స్టేషన్ ప్రకటించారన్న విష యాన్ని పిటిషనర్ తరుపు లాయర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల తర్వాత హైకోర్టు, సీఐని వ్యక్తి గతంగా హాజరుకావాలని ఆదేశించింది. సీసీ కెమె రాల తీరుతెన్నులపై నివేదిక ఇవ్వాలని ఆదేశిం చింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
మార్గదర్శి కేసులో మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయ ఉద్యోగులపై ఏపీ సీఐడీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవద్దనీ, ఆ ఉద్యోగులు పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శి కార్పొరేట్ ఆఫీస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రామకృష్ణారావు ఇతర జీఎంలు, డీజీఎంలు వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను జస్టిస్ విజరుసేన్‌రెడ్డి గురువారం విచారించారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ, ఇతర ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది, విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
సత్వర దర్యాప్తు చేయండి
ఏపీకి చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ గురువారం ఆదేశించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో ఆతను చెప్పిన వాటిని పట్టుకుని సీబీఐ విచారణ చేయడం అన్యాయమని, ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించారు. అనంతరం కేసు విచారణను 17 వ తేదీకి వాయిదా వేశారు.
జస్టిస్ వెంకటేశ్వర్‌రెడ్డికి వీడ్కోలు
రిటైర్ అయిన జస్టిస్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డికి హైకోర్టు వీడ్కోలు చెప్పింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన గురువారం ఫుల్ కోర్టు సమావేశమైంది. అనంతరం జడ్జీల చాంబర్లో వెంకటేశ్వర్‌రెడ్డి దంపతులకు సీజే దంపతులు జ్ఞాపికను అందజేశారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా జస్టిస్ వెంకటేశ్వర్‌రెడ్డిని సత్కరించింది.