Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, అదానీ వంటి కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి రోజైన శుక్రవారం నుంచి వచ్చేనెల 15 వరకు ''బీజేపీకో హటావో...దేశ్‌కో బచావో'' అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సీపీఐ యాత్రను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఏదో ఒక ప్రాంతంలో జరిగే యాత్రలో పాల్గొంటారని వివరించారు. ఇందుకు సంబం ధించిన కార్యాచరణను సిద్ధం చేశామన్నారు. కేంద్ర అంశాలతో పాటు రాష్ట్ర విభజన హామీలను తమ యాత్రలో ప్రస్తావించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అంశాలతో పాటు రాష్ట్రంలోని బయ్యారం, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీటి పారుదల శాఖ అనుమతులు, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా అనేక సమస్యలున్నాయని వివరించారు.
నేడు అంబేద్కర్ విగ్రహం నుంచి యాత్ర
''బీజేపీకో హటావో..దేశ్‌కో బచావో'' 'ఇంటింటికీ సిపిఐ' యాత్రను హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి అక్కడి నుంచి పాదయాత్రగా ఇందిరాపార్క్ వద్దకు చేరుకుంటామని కూనంనేని అన్నారు. అనంతరం ప్రారంభ సభను నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా తదితరులు హాజరవుతారన్నారు. పోడుభూములకు పట్టాలివ్వాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పైనే ఉందని చెప్పారు. గత అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రకటించినట్టుగా పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఏమైనా సాంకేతిక సమస్యలుంటే కేంద్రంతో పోరాటం చేయాలని సూచించారు. కానీ పోడు రైతులకు మాత్రం ఏదో ఒక రూపంలో గ్యారంటీ ఇవ్వాలన్నారు. విద్యుత్ కార్మికులకు 35 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలో రెండో నిందితుడు ప్రశాంత్‌ను బీజేపీ నేతలు సన్మానాలు ఎందుకు చేస్తున్నారో బండి సంజరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తమ పార్టీ జాతీయ పార్టీ హోదాను ఎన్నికల కమిషన్ ఉపసంహరించడం బీజేపీ అనుసరించిన భావజాల దాడి అని కూనంనేని విమర్శించారు.
కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో జాతీయ పార్టీ హోదా ఉపసంహరణ నిర్ణయం అవసరమే లేదని, ఇదొక కుటిల ప్రయత్నమని అన్నారు. చీమలపాడు ఘటనలో ముగ్గురు మరణించడం పట్ల కూనంనేని విచారం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆ ఘటనలో నిందితులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. గవర్నర్ వ్యవస్థ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని విమర్శించారు. బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాత గవర్నర్ ఏ బిల్లు ఎందుకు ఆపారో తెలియజేశారని అన్నారు. ఇది గవర్నర్ వ్యవస్థ నిరంకుశ విధానాలకు నిదర్శనమని అన్నారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాతనే కొన్ని బిల్లులను అక్కడ ఆమోదించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశం కాకుండా, నిరంకుశ, అప్రజాస్వామిక దేశంగా ముందుకెళ్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.