Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లప్పనాయక్ తండావాసుల ధర్నా
నవతెలంగాణ -యాదగిరిగుట్ట రూరల్
తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లప్పనాయక్ తండా వాసులు గురువారం యాదగిరిగుట్ట మండల సర్వసభ్య సమావేశం జరుగుతుండగా ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సమావేశం ప్రారంభమైనప్పుడు తండా సర్పంచ్ బుజ్జి శంకర్‌నాయక్ పోడియం ముందు కూర్కొని నిరసన తెలిపింది. అక్కడ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సర్పంచ్ బయటికి వచ్చిన తర్వాత గ్రామస్తులు కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పరిహారం, పునరావాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. 28 రోజులుగా బస్వాపూర్ రిజర్వాయర్ కట్టపై ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో 250 యూనిట్లను గుర్తించారని, అర్హులైన 50 యూనిట్లను చేర్చి మొత్తం 300 యూనిట్లకు ప్యాకేజీ, 205 ఎకరాల భూమికి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాతరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 294 సర్వే నెంబర్లో లేఅవుట్ చేసి, మౌలిక సదుపాయలు కల్పించి ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని కోరారు. గ్రామకంఠం భూమి 8ఎకరాల 08 గుంటల్లో ప్లాట్ల కేటాయింపు, ఇండ్లకు పరిహారం ఒకే దఫాలో అందిం చాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు బస్వాపూర్ రిజ ర్వాయర్ కట్టపై ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం తహసీల్దార్ శోభన్ బాబు మాట్లాడుతూ.. అన్ని విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు నిరసన విరమించారు. ఈ సమావేశంలో లప నాయక్ తండావాసులకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. నిరసన, మండల సమావేశాల్లో ఎంపీపీ చీర శ్రీశైలం, జెడ్పీటీసీ తోటకూర అనురాధ, ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి, వైటీడీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పురు షోత్తంరావు ఎంపీటీసీలు సర్పంచులు, లప్పనాయక్‌తండా ఉపసర్పంచ్ మంక్యా నాయక్, మోహన్, దసిరం నాయక్, బాధితులు పాల్గొన్నారు.