Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మశ్రీ, రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత ఆచార్య శాంతా సిన్హా
నవతెలంగాణ-కేయూ క్యాంపస్
ఎన్నికలు ఒక్కటే ప్రజాస్వామ్యం కాదని, నిరంతర జాతి నిర్మాణానికి కృషి జరగాలని పద్మశ్రీ, రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత ఆచార్య శాంతాసిన్హా అన్నారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో వీసీ ఆచార్య తాటికొండ రమేష్ అధ్యక్షతన ఆచార్య బి.జనార్ధన్‌రావు మెమోరియల్ ఫౌండేషన్ 21వ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు దూరవిద్యా కూడలిలో ఉన్న జనార్ధన్‌రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. గొప్ప మేధావి ఆచార్య జనార్ధన్‌రావు అని కొనియాడారు. ప్రభుత్వ పథకాల్లో అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరేందుకు పాటుపడ్డారని చెప్పారు. ప్రభుత్వ విధానాల్లో మార్పులు చట్ట సభల ద్వారా రాలేదని, ఉద్యమాల వల్ల వచ్చాయని అన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ఎన్నికల విధానం అత్యంత ఆందోళనకరం అన్నారు. యువత ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా అడుగులు వేయాలని కోరారు. విద్యార్థుల నుంచి నాయకులుగా రావాలన్నారు. ఆచార్య తాటికొండ రమేష్ మాట్లాడుతూ.. ప్రజలు, ఆదివాసీల సమస్యలు తెలిసిన వ్యక్తి జనార్ధన్‌రావు అని కొనియాడారు. అనంతరం ఆచార్య శాంతా సిన్హాను ఘనంగా సన్మానించారు. విశ్రాంత ఆచార్యులు ఆచార్య కె.మురళి మనోహర్, ఫౌండేషన్ సెక్రటరీ ఆచార్య ఇ.రేవతి, ఆచార్య నరేంద్ర బాబు, టి.బుచ్చిబాబు, పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.