Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయ్యారానికి మొండిచేయి
- కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
- వికారాబాద్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తాం..: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- వికారాబాద్‌లో మెడికల్ కాలేజీ, ఆయుష్ ఆస్పత్రికి శంకుస్థాపన
నవతెలంగాణ వికారాబాద్ ప్రతినిధి, మర్పల్లి
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ విషయంలో సీఎం కేసీఆర్ ముందడుగు వేయడంతోనే కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకటన చేశారన్నారు. ఇది కార్మికుల, ప్రజల విజయంగా అభివర్ణించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేసే వరకూ పోరాడుతామన్నారు. గురువారం వికారాబాద్ జిల్లాలో మంత్రి పర్యటించారు. వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిలో రూ.7.50 కోట్లతో 50 పడకల ఆయుష్ ఆస్పత్రి, రూ.3.6 కోట్లతో కేంద్రీయ ఔషధ గిడ్డంగి నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో 280 అదనపు పడకల విస్తీర్ణపు నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వికారాబాద్‌కు కృష్ణా జలాలను రప్పించి ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు మొండిచేయి చూపిందన్నారు. అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయలేదన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తోందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. చివరకు సబ్సిడీ బియ్యంలోనూ కోత విధించినట్టు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం, వైద్యం, విద్యుత్, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వ సంక్షేమాల పట్ల ప్రజల్లో చర్చ పెట్టాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎండగడుతూ ఆ పార్టీల నాయకులు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. అంతకుముందు మంత్రులు అనంతగిరి గుట్టలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మర్పల్లి మండల కేంద్రంలో వికారాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.