Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనువాదానికి గోరీకడదాం..
- ఆర్థిక దోపిడీ.. సామాజిక అణచివేతపై జమిలి పోరాటం
- సీఐటీయూ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ పాదయాత్రలు
నవతెలంగాణ- విలేకరులు
దేశంలో సామాజిక న్యాయాన్ని కాపాడాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం వాక్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాలు జరిగాయి. నిజామాబాద్, వికారాబాద్, భూపాలపల్లి జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహించినట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు.
మనువాదానికి గోరీకట్టేందుకు కార్మిక, కర్షకులు సంఘటితంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సామాజిక న్యాయ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో 10కె, వాక్ ఫర్ సోషల్ జస్టిస్ పాదయాత్ర నిర్వహించారు. కంది మండల కేంద్రం నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా కార్మికులు కదం తొక్కారు. కంది కేంద్రంలో చుక్క రాములు డాక్టర్ బీఆర్ అంబేదర్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించి నడిచారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి కాలం చెల్లిన మూడు వేల సంవత్సరాల నాటి మనువాదాన్ని రాజ్యాంగంగా గుర్తించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్రలు చేస్తున్నామన్నారు. మతోన్మాదాన్ని అడ్డుకోకపోతే లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిళ్లుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో సామాజిక న్యాయ పాదయాత్రలు నిర్వహించారు.
ఖమ్మం నగరంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి పాత కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా నుంచి జలగం నగర్ వరకు పాదయాత్ర సాగింది.
కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కరీంనగర్లో కళాభారతి నుంచి కలెక్టరేట్ వరకు, సిరిసిల్ల జిల్లాలో ధార్మిక క్షేత్రమైన వేములవాడ నుంచి కార్మిక క్షేత్రం సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. పెద్దపల్లి బస్టాండ్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు.
10కె వాక్ ఫర్ సోషల్ జస్టిస్ నినాదంతో హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కలెక్టరేట్ వరకు వందలాది మందితో సాగింది. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జనగామ జిల్లాలో రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు సామాజిక న్యాయ పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో మన్సూర్‌కు అందజేశారు. ములుగు జిల్లా తాడ్వాయ మండలం కాటాపూర్‌లో పాదయాత్ర నిర్వహించారు.