Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో నేతల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)- 2020ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. ఎన్ఈపీ అమలు పేరుతో పాఠ్యపుస్తకాల్లోని చరిత్ర పాఠ్యాంశాల తొలగింపు, తరగతి గదుల్లో ఉపాధ్యాయులు నిలబడే బోధించాలనటం సరైంది కాదన్నారు. ఈ చర్యలన్నీ ప్రభుత్వ విద్యారంగం విధ్వంసానికి, కేంద్ర పాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వేనని విమర్శించారు. టీఎస్‌యూటీఎఫ్ పదో ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ లక్ష్యాలను విస్మరించి కేంద్రీకరణ, ప్రయివేటీకరణ, కాషాయీకరణల దిశగా సాగుతున్న ఎన్ఈపీ-2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకా ల్లోని కింగ్స్ అండ్ క్రానికల్స్, మొఘల్ కోర్ట్స్, మహాత్మాగాంధీ హత్య, గుజరాత్ అల్లర్లు వంటి పాఠ్యాంశాలను తొలగించటం చరిత్రను మరుగుపరచటానికేనని విమర్శించారు. ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే సాధారణ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయటం మభ్యపెట్టటానికేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జీతాలు, సప్లిమెంటరీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో ఉద్యోగులు, అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ సింహాచలం, పత్రిక సంపాదకులు పి మాణిక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు శారద, వెంకటప్ప, రాజారావు, నరసింహారెడ్డి, నాయకులు మస్తాన్‌రావు, రామకృష్ణ, మాజిద్, విఠలాచార్య, వెంకటేశ్వర్లు, కవిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.