Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలించని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు
- డిమాండ్లను నోట్ చేసుకున్న జేసీఎల్
- 24న తదుపరి చర్చలుంటాయని ప్రకటన
- 17 నుంచి సమ్మె ఉంటే 24న చర్చలేంటంటూ జేఏసీ ఆగ్రహం
- ముందే జరపాలని కోరినా పట్టించుకోని కార్మిక శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ అమలు విషయంపై రాష్ట్ర సర్కారు ఎటూ తేల్చకుండా సాగదీస్తూ పోతున్నది. ఈ నెల 17 లోపలే పీఆర్సీని ఫైనల్ చేయాలన్న అంశాన్ని పట్టించుకోలేదు. గురువారం హైదరాబాద్‌లోని అంజయ్య భవన్ (కార్మికశాఖ రాష్ట్ర కార్యాలయం)లో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డి.శ్యామ్‌సుందర్‌రెడ్డి సమక్షంలో విద్యుత్ శాఖ మేనేజ్మెంట్కు, జేఏసీ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మేనేజ్మెంట్ తరఫున ట్రాన్స్‌కో జేఎమ్డీ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్(హెచ్ఆర్) అశోక్ కుమార్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(హెచ్ఆర్) వెంకటేశ్వర్ రావు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్(హెచ్ఆర్) పర్వతం పాల్గొ న్నారు. జేఏసీ నుంచి 14 మంది హాజరు కాగా.. వారిలో సాయిబాబు, ప్రభాకర్‌రెడ్డి, బీసీరెడ్డి, గోవర్ధన్, వజీర్, వెంకన్నగౌడ్, నాగరాజు, తదితరులు న్నారు. పీఆర్సీ అమలు, ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చటం, విద్యుత్ శాఖలోని ఇతర ఉద్యోగుల మాదిరిగానే ఆర్టిజన్ ఉద్యోగులకు సమాన స్కేల్, రూల్స్ వర్తింపజేసి రెగ్యులర్ క్యాడర్(జేఎల్ఎమ్)గా గుర్తించాలి అంశాలను జేఏసీ నేతలు ప్రధాన అజెండాగా కార్మిక శాఖ ముందు ఉంచారు.
ఈ అంశాలను జేసీఎల్ నోట్ చేసుకున్నారు. తదుపరి చర్చలు ఈ నెల 24న ఉంటాయని ప్రకటించారు. దీనిపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 17 నుంచి తాము సమ్మెలోకి వెళ్తుంటే 24న చర్చలకు పిలవడమేంటి అని ప్రశ్నించారు. సమ్మె తేదీ కంటే ముందే చర్చలు జరపాలని కోరారు. దీన్ని కార్మిక శాఖ పట్టించుకోలేదు. 24నే చర్చలుం టాయని స్పష్టం చేసింది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఈ నెల 17 నుంచి విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం ఖాయమని జేఏసీ నేతలు తెలిపారు.