Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్స్ వైద్యులకు హరీశ్ రావు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్ వైద్యులు అరుదైన మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న 12 ఏండ్ల చిన్నారికి విజయవంతంగా మూత్రపిండ మార్పిడి చేశారు. నిమ్స్ యురాలజిస్టులు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని దశకు చేరుకున్న సమయంలో బాలుడికి భవిష్యత్‌కు మెరుగైన జీవితం అందించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన బాలుడు ఆరవ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడి తల్లిదండ్రులు పేదవారు. తండ్రి కూలీ పనులు చేసుకుంటుండగా తల్లి కొడుకు ఆరోగ్యం చూసుకుంటూ ఇంటిపట్టునే ఉండేది. ఈ చిన్నారి బైలేటరల్ వెసికోర్టెరిక్ రిఫ్లక్స్ అనే మూత్రనాళ సమస్యతో బాధపడుతున్నాడు. ఇది పుట్టుకతో వచ్చే సమస్య. దీంతో కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఏడాది క్రితం నుంచి డయాలసిస్ మీదే బతుకుతున్నాడు. నిమ్స్ డాక్టర్లు పూర్తిగా బాలుడి పరిస్థితిని పరిశీలించి రెండు దశల్లో చేయాల్సిన ప్రొసీజర్‌కు ప్రణాళిక రూపొందించారు. మొదట ఎడమ నెఫ్రోర్రెక్టమీని తర్వాత కుడి నెఫ్రోర్రెక్టమిని లాప్రోస్కోపిక్ ద్వారా శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత రెండో దశలోనే మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సని విజయవంతంగా చేశారు. ఆపరేషన్ తర్వాత బాలుడి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. మూత్రపిండాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుంది. సీరమ్ క్రెటినైన్ స్థాయిలు కూడా 7 నుంచి 0.4కు తగ్గినట్టు డాక్టర్లు తెలిపారు. ఇక కొడుకుకు కిడ్నీని దానం చేసిన బాలుడి తల్లి ఆరోగ్యం కూడా బాగుందని డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్స్ యురాలజి విభాగాధిపతి ప్రొఫెసర్, డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంత చిన్న వయసు బాలుడికి ఇలాంటి సర్జరీ జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. బాలుడి చికిత్స ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసినట్టు చెప్పారు. తమకు ప్రోత్సాహాన్నందిస్తున్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, నిమ్స్ డైరక్టర్ డాక్టర్ బీరప్పకు వైద్యులు ధన్యవాదాలు తెలిపారు. బాలునికి విజయవంతంగా మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యులను మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు.
డాక్టర్ దేవరాజ్‌తో పాటు యూరాలజిస్టులు డాక్టర్ రామ్ రెడ్డి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ చరణ్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ వినరు, డాక్టర్ సునిల్, డాక్టర్ అరుణ్, డాక్టర్ విష్ణు, డాక్టర్ హర్ష, డాక్టర్ జానకి, డాక్టర్ పవన్, డాక్టర్ సూరజ్, డాక్టర్ పూవర్సన్, డాక్టర్ అనంత్, డాక్టర్ షారూక్ లు విజయవంతంగా బాలుడి శస్త్రచికిత్సను పూర్తి చేశారు. వీరికి అనస్తీసియాలజీ నిపుణులైన డాక్టర్ నిర్మల, డాక్టర్ ఇందిర, డాక్టర్ కిరణ్, షిబానీతో పాటు నెఫ్రాలజిస్ట్లైన డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ గంగాధర్, డాక్టర్ భూషన్ రాజులు సాయమందించారు.