Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫేక్ చాట్లతో దుష్ప్రచారం
- సుఖేశ్ తో ఎలాంటి పరిచయము లేదు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే బీజేపీ నాయకులు తనపై దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఫేక్ చాట్లతో వారు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సుఖేశ్‌తో తనకు ఎలాంటి పరిచయమూ లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ''గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక. తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవి ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దానిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ ఇలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ను, కేసీఆర్ కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు కొన్ని మీడియా సంస్థల తీరు తయారైంది. ఇది అత్యంత దురదృష్టకరం. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బీఆర్ఎస్పై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంత దిగజారి వార్తలు ప్రసారం చేస్తారో అని తెలంగాణ సమాజం గ్రహించాలి..జాగ్రత్త పడాలి..... '' అని కవిత ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. పాలేంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులు. అందువల్ల నిజం నిలకడ మీద తెలుస్తుందని ఈ సందర్భంగా కవిత తెలిపారు. కేసీఆర్ మీద కక్షతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై బురద జల్లే వార్తలకు ప్రాధాన్యతనిచ్చిన కొన్ని మీడియా సంస్థలకు దమ్ము, నిజాయితీ ఉంటే తన వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సవాల్ చేశారు. తలవంచేది లేదనీ, తెగించి కొట్లాడుతామని ఆమె స్పష్టం చేశారు.