Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు దశలుగా రాష్ట్రవ్యాప్త ఆందోళన
- మే 15న హైదరాబాద్‌లో మహాధర్నా
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశం తీర్మానం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని జర్నలిస్టుల ఇండ్లస్థలాల కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రత్యక్ష కార్యా చరణను ప్రకటించింది. వచ్చే రెండు నెలల పాటు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం స్థలాలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని కొన సాగించాలని తీర్మానించింది. గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర విస్త్రృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఆయా జిల్లాల అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండ్ల స్థలాలపై సుదీర్ఘంగా చర్చించిన సమావేశం, పలు నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 17, 18 తేదీల్లో నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో జర్నలిస్టుల సంతకాలు సేకరణకు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు సమర్పిం చాలని తీర్మానించింది. మే 2, 3 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేయాలని కోరింది. అలాగే మే 15న హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని సమాశం నిర్ణయించింది.
ఫెడరేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ ఇండ్లస్థలాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. గత 35 ఏండ్లుగా ఇండ్లస్థలాల కోసం జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించకపోవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. విస్త్రృతస్థాయి సమావేశం నిర్ణయాలను కచ్చితంగా అమలు చేయాలని ఫెడరేషన్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పి.ఆనందం, ఎల్గోయి ప్రభాకర్, బండి విజరు కుమార్, గుడిగ రఘు, పి.రాధిక, వి.జగన్, బి.విజయానంద్, బి.రాజశేఖర్, కార్యదర్శులు ఎర్రం నర్సింగరావు, ఎస్కె సలీమ, ఇ. చంద్రశేఖర్, గండ్ర నవీన్, బి.దామోదర్, బి. జగదీశ్వర్, కొప్పు నిరంజన్, పి.బిక్షపతి, కె.అనిల్‌రెడ్డి, తన్నీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.