Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లుతోంది
- ఇప్పటికే మనుస్మృతి విధానాలు యూపీలో అమలు :నవతెలంగాణ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
'కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాల ఫలితంగా సమాజం సంక్షోభంలో కూరుకుపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అంబేద్కర్ యాదికొస్తడు.. అందుకే ఇప్పుడు ఏ నోట విన్నా అంబేద్కరే.. నేడు ఆయన ఆశయాలకు పాలకులు నుంచే ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలన్న నినాదాల ప్రాముఖ్యత పెరుగుతున్నది..' అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్నకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
అంబేద్కర్ ఆశించిన సమాజం ఏంటి? ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆచరణ అందుకు అనుగుణంగా ఉందా?
సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు.. ముందే ప్రమాదాన్ని పసిగట్టి, పరిష్కారం చూపించిన వారిని సహజంగానే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అదే ఇప్పుడు అంబేద్కర్ విషయంలో జరుగుతున్నది. ఆయన అసమానతలు లేని సమాజం కోసం పరితపించిండు. అణగారిన తరగతుల అభ్యున్నతిని కోరుకున్నడు. ముఖ్యంగా అంటరాని తనం, వివక్షతకు వ్యతిరేకంగా జీవితాంతం పనిచేసిన దార్శినికుడు అంబేద్కర్.. అందుకే ఎప్పుడూ లేని విధంగా జేఎన్‌యూ విద్యార్థులు మొదలు..బాధిత మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థుల వరకు సకల రంగాలు, సంఘాలు ఆయన్ను గుర్తుచేసుకుంటున్నాయి. అయితే ఆయన ఆశించిన విధంగా, నిర్దేశించిన దశ, దిశలో ప్రభుత్వాలు పాలించటం లేదు. రాజ్యాన్ని రక్షించాల్సిన ప్రభుత్వాలు..పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తున్నవి. సంస్థలను, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నవి. ''ఒక వర్గాన్ని ఇంకొక వర్గం పైకి ఉసిగొల్పే ధోరణి చాలా ప్రమాదకరం'' అంటూ అంబేద్కర్ హెచ్చరించినట్టుగా ప్రస్తుతం దుర్భర పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక హక్కుల కోసం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సంఘటితం కావటమొక్కటే మార్గం.
ఇతర దేశాల రాజ్యాంగాల్లోంచి అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని అంశాలు పట్టుకొచ్చిన అతుకుల బొంత రాజ్యాంగమంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి?
భారత రాజ్యాంగం పట్ల బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ 'బంచ్ఆఫ్ థాట్స్'లోనే రకరకాల ఆలోచనలు చేసింది. వీహెచ్‌పీ నిర్వహించిన ధర్మసంసద్ భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకంగా ఉన్నదనీ, దాని స్థానంలో హిందూ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని తీర్మానించింది. మనుస్మృతిలో గొప్ప సమతా ధర్మమున్నదనీ, భారత రాజ్యాంగం కన్నా అదెంతో ఉన్నతమైందని ప్రకటించింది. ఈ రకంగా మొదటి నుంచీ రాజ్యాంగం పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరితోనే ఉంది. వాజ్‌పారు కాలంలో రాజ్యాంగ సమీక్షకు జస్టిస్ వెంకటాచలమయ్య నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. రాజ్యాంగాన్ని మార్చటానికి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉందని గుర్తించాకే ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ ఎప్పటికైనా రాజ్యాంగాన్ని మార్చటం వాళ్ల లక్ష్యం.తమ మతోన్మాదంలోకి దళితులను కూడా లాగటానికి అంబేద్కర్ మాటలను సందర్భ శుద్ధి లేకుండా ఉటంకిస్తూ సంఫ్‌ు పరివార్ శక్తులు ఆయన్ని కూడా వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రస్తుతం మనుస్మృతి బాటలో బీజేపీ నడుస్తున్నదన్న విమర్శ ఉన్నది ఇది సహేతుకమైన విమర్శేనా?
నిజమే..రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఒకటొకటిగా రాలిపోతున్నాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం నలిగిపోతున్నది. పౌరులు ఏ దుస్తులు వేసుకోవాలి, ఏ భాష మాట్లాడాలి, ఏమేం చదవాలి, ఏమేం చదవకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది కూడా మనువాదులు నిర్ణయించే పాడుకాలం వచ్చింది. మనుస్మృతి విధానాలు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. లైంగిక దాడులు చేసినా, హత్యలు చేసినా, కులం పేరుతో వెలివేసినా అడగటానికి వీలు లేదు. ఇది మన ఖర్మ అని సరిపెట్టుకోవాలంటున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం తదితర అంశాలకు వారి రాజ్యాంగంలో చోటుండదు. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలకు తావుండదు. వీటిని ద్వసం చేయటమే ప్రస్తుతం బీజేపీ కర్తవ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ ఆలోచనలను, రాజ్యాగ విలువలను రక్షించుకునేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ఉంది.