Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత పారిశ్రామికవేత్తలు మరింత ఎదగాలి-మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అందరికి సమాన ఓటు హక్కు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఆ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురువారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంబేద్కర్ ముందు చూపుతో పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించారని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతమే తనకు ఆదర్శమని ఆయన చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మతం, కులం మనిషి తన స్వార్థ్యం కోసం సృష్టించు కున్నవేననీ, మనుషులంతా సమానమని వ్యాఖ్యా నించారు. ఎవరి జీవితం శాశ్వతం కాదని తెలిపారు. పరిమితమైందంటూ అందులో అధికారం మరింత పరిమితమైందని అన్నారు. అధికారం అసలు శాశ్వతమేమి కాదని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు అధికారంలోకి వచ్చామనీ, మరోసారి ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తామని తెలిపారు. అయితే ప్రజలకు మేలు చేసే క్రమంలో ప్రతి విషయం ఓట్లతో ముడిపెట్టి చేయలేమనీ, శాశ్వతంగా ప్రజలకు మేలు చేసేవి కూడా ఉంటాయని చెప్పారు. అందుకే తెలంగాణ ఆచరిస్తున్నదాన్ని....దేశం అనుసరించే స్థాయికి ఎదిగగలిగామని వివరించారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని ఉదహరించారు.
తెలంగాణ దళిత పారిశ్రామికవేత్తలు దేశానికే ఆదర్శంగా ఎదగాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దళితులు ఆర్థికంగా ఎదుగుతుంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఓటమికి నిరాశ చెందవద్దని చెబుతూ.. సీఎం కేసీఆర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఓడిపోయిన సంగతిని గుర్తుచేశారు. విజయం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. కొత్త ఆలోచనలను సమాజం వెంటనే అంగీకరించదనీ, హేళన చేసే వారు కూడా ఎక్కువగా ఉంటారని చెప్పారు. అయితే ఒకసారి విజయం సాధించిన తర్వాత అలాంటి వారంతా మార్పు కోరిన వారిని అనుసరిస్తారని తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీ ప్రైడ్ ద్వారా ప్రోత్సాహకాలు, అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.