Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసమానతలు లేని సమాజం కోసం తపించిన మహోన్నతుడు
- దురాచారాలను ఎదురొడ్డిన ధీరోదాత్తుడు : సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవితంలో ఎన్ని ఆటంకాలెదురైనా ఆత్మన్యూనతకు, దుర్భలత్వానికి గురికాకుండా గొప్ప ఆలోచనలతో గెలుపు శిఖరాలను చేరుకున్న విశ్వమానవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొనియాడారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పరితపించిన మహోన్నతుడు అని ప్రశంసించారు. అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. సమాజంలో నెలకొన్న అజ్జానాంధకారాలను చీల్చుకుంటూ జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ప్రపంచ మేధావి ఆయన అని ప్రశంసించారు. కష్టంతో కూడుకున్న ఎంతటి సుధీర్ఘ ప్రయాణమైనా చిత్తశుద్ధి, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకోవడం ఖాయమనీ, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితమే నిదర్శనమని పేర్కొన్నారు. వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అని కొనియాడారు. సమస్త శాస్త్రాలను ఔపోసన పట్టిన అంబేద్కర్.. ప్రజాస్వామ్యం, వర్ణ నిర్మూలన, అంటరానితనం, మతమార్పిడులు, స్త్రీల హక్కులు, మతం, ఆర్థిక సంస్కరణలు, చరిత్ర, ఆర్థికవ్యవస్థ తో పాటు అనేక అంశాలపై చేసిన రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపచేశాయని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. నేడు దేశంలో అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ తన మేధస్సుతో మదించి సమకూర్చినవేనని తెలిపారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహాన్ని ఆయన జయంతి రోజున ప్రతిష్టించడం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచిన తెలంగాణ బాంధవుడు అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపులో భాగంగా దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్ర నూతన సచివాలయానికి 'డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం' అనే పేరు పెట్టి ఆయన్ను స్మరించుకుంటున్నామని తెలిపారు. అన్ని పథకాలతో పాటు సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ సామాజిక తరగతుల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దళితుల కోసం గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతి నిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, దళితులను ఎంటర్ ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో టీఎస్‌ప్రైడ్, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం దేశ చరిత్రలోనే విప్లవాత్మక పథకంగా మారిందని తెలిపారు. తెలంగాణలోని దళిత సమాజం భారతదేశానికే ఆదర్శంగా నిలవబోతున్నదని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని తెలిపారు.