Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలువనీడ పేదల హక్కు
- అదరొద్దు.. బెదరొద్దు..
- రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాల్లో పేదల గుడిసెలు
- జగిత్యాల జైత్రయాత్రలా కోరుట్ల భూపోరాటాన్ని సాగిస్తాం : కోరుట్ల భూపోరాటంలో సీపీఐ(ఎం) నేతలు నాగయ్య, ఎస్.వీరయ్య
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / కోరుట్ల / గోదావరిఖని
'నిలువ నీడ కోసం, రాజ్యాంగం కల్పించిన బతికే హక్కుతోనే పేదలు ఇంటిజాగల కోసం పోరాడుతున్నారు. లంచాలు ఇచ్చి రహస్యంగా గుడిసెలు వేసుకోవడం లేదు. తమ హక్కుగానే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారు. రూ.కోట్ల విలువజేసే వందలాది ఎకరాలు కబ్జా చేస్తున్న నాయకులు, అక్రమార్కుల జోలికి రెవెన్య, పోలీసు అధికారులు పోవడం లేదు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలపైనే జులుం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాల్లో వేలాది మంది సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదు' అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ భూమిలో గెడిసెలు వేసుకుని ఐదు రోజులుగా పోరాడుతున్న పేదలను, వారికి అండగా నిలిచి అరెస్టయిన సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వాన్ని శుక్రవారం వారు పరామర్శించారు. వేసిన గుడిసెలు తగలబెట్టిన చోటనే పేదలతో కలిసి అంబేద్కర్ 132జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జి.నాగయ, ఎస్.వీరయ్య మాట్లాడారు.
ఎర్రజెండా పోరాటాల్లో లాఠీదెబ్బలు, అరెస్టులు, జైళ్లు, పీడీయాక్టులు కొత్తేమీ కాదని, నిరంతరం పేదల పక్షాన వారి హక్కుల రక్షణకు కవచంగా ఎర్రజెండా పనిచేస్తుందని చెప్పారు. ఈ పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు, కష్టనష్టాలు వస్తాయని, వాటన్నింటినీ ఎదిరిస్తేనే ఉండేందుకు కాస్త ఇంటి స్థలం వస్తుందని పేదలకు సూచించారు. వరంగల్ జిల్లా నడిబొడ్డున జక్కలొద్దిలో పేదల పక్షాన సీపీఐ(ఎం) భూపోరాటం చేసి విజయం సాధించిన విషయాన్ని వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(ఏ) పేదలకు బతికే హక్కు ఉందని చెబుతోందని, అంటే వారికి ఇల్లు ఉండాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చిందని తెలిపారు. అదే రాజ్యాంగంలోని 32.2 అధికరణం.. సమాజంలో అసమానతలు ఉండొద్దని, కనీస హక్కులు ప్రతి ఒక్కరికీ కల్పించాలని చెబుతోందన్నారు. దాని స్ఫూర్తితోనే నిలువనీడలేని పేదల కోసం ఈ భూపోరాటాన్ని సాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేసిన సర్వేలోనే రాష్ట్రంలో 32లక్షల మందికి నిలువ నీడలేదని గుర్తించారని, వారందిరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిందని అన్నారు. ఈ 9 ఏండ్ల కాలంలో 2లక్షల ఇండ్లే నిర్మించిన సర్కారు అందులో ఇప్పటివరకు 32వేల ఇండ్లే పంచిందన్నారు. మిగిలిన పేదలకు ఇండ్లు కట్టి ఇచ్చేందుకు ఎన్నేండ్లు పడుతుందని ప్రశ్నించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లల బాలకృష్ణ మాట్లాడుతూ.. కోరుట్ల మద్దూర్ చెరువులోని వందల ఎకరాలను కొందరు నేతలు, సంపన్న వర్గాలు కబ్జాచేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. కోరుట్ల బస్టాండ్ ఎదురుగా, గడీబజార్లో కూడా ఎన్నో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని వివరించారు. అలాంటి వారిపై కనీసం చర్యలు తీసుకోలేని అధికారులు పేదలపై ప్రతాపం చూపుతున్నారని, వారి బెదిరింపులకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ తిరుపతినాయక్, జిల్లా కమిటీ సభ్యులు సులోచన, సీనియర్ నాయకులు సారంగపాణి, వందలాది మంది పేదలు పాల్గొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితోనే భూపోరాటం
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి
ప్రజలకు సామాజిక, ఆర్థిక అసమానతలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తితోనే భూపోరాటం చేస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి అన్నారు. సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలో సాగుతున్న భూపోరాటంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రాజకీయ పార్టీల నాయకులు పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. 28 రోజులుగా ఎర్రటి ఎండను లెక్కచేయకుండా సాగిస్తున్న భూపోరాటం నాయకులకు కనిపిస్తలేదా? అని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, సీనియర్ నాయకులు నరివిట్ల నరసన్న పాల్గొన్నారు.