Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ
- బీజేపీని గద్దె దించాల్సిందే
- 'ఇంటింటికీ సీపీఐ' పాదయాత్ర ప్రారంభ సభలో వక్తలు
- సీపీఐ(ఎం) సంఘీభావం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పేదలకు అండగా ఉండేది కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే పేదలకు భూములు, ఇండ్లు దక్కుతున్నాయనీ, లేకుంటే పాలకులు వాటన్నింటినీ రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టేస్తారని చెప్పారు. ప్రజలందరిపై పన్నులు వేసి, కొందరు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ, ప్రజాధనాన్ని మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు 'బీజేపీ హఠావో దేశ్ బచావో' నినాదంతో రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో 'ఇంటిం టికీ సీపీఐ' కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాపార్కు వరకు జరిగిన పాద యాత్రతో ప్రారంభమైంది. సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్‌షర్ట్ వాలంటీర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఇందిరాపార్కు వద్ద జరిగిన బహిరంగ సభలో నారా యణ మాట్లాడారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే రాష్ట్రాల్లో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు ప్రజల్లో చైతన్యం నింపాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపైనే ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన ఓటుహక్కు ప్రాధాన్యతను ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఓటును అమ్ముకోవద్దని చెప్పారు. భూ పోరాటాలు మరింత విస్త్రుతం కావాలన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీకి ఇచ్చిన రాయితీల్లో పది శాతం ఖర్చు చేసినా పేద ప్రజానీకానికి ఇండ్లు నిర్మించి ఇవ్వచ్చన్నారు. ఉపాధిహామీకి నిధులు కుదించారని గుర్తుచేశారు. దేశంలో పేదరికం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని పరోక్షంగా బీజేపీ ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ మోడీ కేంద్రంలో అధికారానికి రాకముందు చెప్పిన మాటలు, హామీలన్నిం టినీ చెత్తకుప్పలో పడేశారనీ, పేదలపై పన్నుల భారాలు పెంచి, కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నారని అన్నారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పాలకులు పేదలు, దళితులు, బలహీనవర్గాల పట్ల నిర్లక్ష్యం, వివక్ష చూపుతున్నారని చెప్పారు. వారికి కావల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. విద్య, వైద్యం కార్పొరేట్ మయమైందనీ, పేదలు ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించి, మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, దీనికి కారణం మోడీ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అత్యంత ప్రమాదకరమనీ, వారికి ముస్లిం లు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు ప్రధమ శత్రువులని చెప్పారు. సామాజిక న్యాయాన్ని కోరే కమ్యూనిస్టులు లేకుండా చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ ప్రధాన సిద్ధాంతమనీ, దానికి అనుగుణంగానే బీజేపీ పాలన సాగుతున్నదని స్పష్టంచేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ మౌలిక సుత్రాలు ప్రమాదంలో పడ్డాయనీ, వాటిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తున్నాయనీ, సమస్యల పరిష్కారానికి కలిసి పోరాటం చేయాలని చెప్పారు. సీపీఐ చేపట్టిన 'ఇంటింటికి సీపీఐ' కార్యక్రమం లో సీపీఐ(ఎం) శ్రేణులు కూడా పాల్గొంటాయని తెలిపారు. కార్యక్ర మానికి అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో కమ్యూనిస్టు పార్టీకి ఉన్న స్థానాన్ని ఎన్నికల కమిషన్ నిలువరించలేదని అన్నారు. తాము ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. బ్రిటీష్ కాలంలో కూడా సీపీఐ గుర్తింపును రద్దు చేశారనీ, ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అలాంటి చర్యలకే పాల్పడుతున్నదని అన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ మోడీ పంజరంలో చిలుకలా మారిందని ఎద్దేవా చేశారు. మనిషి ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటింటికీ సీపీఐ కార్యక్రమంలో కొత్తగూడెంలో లక్ష మందితో బహిరంగ సభను నిర్వహిస్తామ న్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నర్సింహా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, వీఎస్ బోస్, జాతీయ సమితి సభ్యులు ఎమ్డీ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.