Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సవాళ్లకు అనుగుణంగా సరికొత్త వ్యూహంతో పనిచేయాలి
- పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ అంజనీకుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం సమీపిస్తున్నందున శాంతి భద్రతల పరిరక్షణలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద చారిత్రక 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పోలీసు కమిషనర్లు (సీపీ), ఎస్పీలతో హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. అడిషల్ డీజీలు మహేష్ భగవత్, సంజరు కుమార్ జైన్, విజయ్ కుమార్, షికా గోయల్, సందీప్ శాండిల్య, రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్, ఐజీలు కమలహాసన్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ కాసీం, డీఐజీ రమేష్ రెడ్డి తదితర సీనియర్ పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు పాదయాత్రలు, బహిరంగ సభలు అధికంగా నిర్వహిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచ్‌ల పనితీరు అత్యంత కీలకమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో బందోబస్తు ఒక పరీక్షగా ఉంటుందని, ప్రతిసారి ఎదురయ్యే కొత్త సవాళ్లకు అనుగుణంగా సరికొత్త వ్యూహంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రానికి ఉన్న సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్ఘడ్, జార్ఖండ్‌లకు చెందిన సరిహద్దు జిల్లాలపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా తీవ్రవాద పార్టీల సానుభూతిపరులు, మాజీలు, మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టిసారించా లన్నారు. సామాన్య ప్రజలు, పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో పోలీస్ సిబ్బంది, అధికారుల ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలోనైనా పోలీస్ అధికారులు అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తే అది మొత్తం పోలీస్ శాఖకే మచ్చగా ఉంటుందని హెచ్చరించారు. పోలీస్ అధికారుల గ్రామాల సందర్శన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ఈ విధానాన్ని మరింత పటిష్టంగా కొనసాగించాలని ఆదేశించారు.
సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యపర్చాలి
ప్రపంచంతోపాటు తెలంగాణలోనూ సైబర్ నేరాల పెరుగుదల ఉందని, వాటి పట్ల ప్రజలను చైతన్య పర్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అంజనీ కుమార్ అన్నారు. సైబర్ క్రైమ్ అనేది కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాలేదని ఇది గ్రామాలకూ వ్యాపించిందన్నారు. ఈ సైబర్ నేరాల నివారణకు కేవలం ప్రజల్లో చైతన్యమే మార్గమని చెప్పారు. ఇందుకుగాను, రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కనీసం పది మంది పోలీస్ అధికారులకు సైబర్‌క్రైమ్ నివారణలో ప్రత్యేక శిక్షణ నివ్వాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా విస్తృతి గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో పోలీస్ విభాగాల్లోని సోషల్ మీడియాను మరింత పటిష్టపర్చుకోవాలని డీజీపీ వివరించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు అధికంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలిసి రోడ్డు ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రస్తుత రంజాన్ పండగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా జరగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాల పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా వహించాలని ఆదేశించారు.
నవసమాజ నిర్మాణానికి పోలీస్ అధికారులు పునరంకితం కావాలి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో నవ సమాజ నిర్మాణానికి రాష్ట్రంలోని పోలీస్ అధికారులందరూ పునరంకితం కావాలని అంజనీ కుమార్ అన్నారు. డీజీపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంజనీ కుమార్ మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేనంతగా చారిత్రక అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.