Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుంటాలలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- వచ్చే మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఓవైపు ఎండలు మండిపోతుండగా...మరోవైపు అక్కడక్కడా వర్షాలు పడుతూ భిన్నమైన వాతావరణం నెలకొంది. శుక్రవారం రాష్ట్ర మంతటా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. కొమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కుంటాలలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, తొమ్మిది జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా, హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్‌లో అత్యధికంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ఎక్కువ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ మూడు జిల్లాల పరిధిలోనే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల వరకు రాష్ట్రంలో 30కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి పరిధిలోని ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో అత్యధికంగా ఒక సెంటీమీటర్ వర్షం కురిసింది. చిరుజల్లులు పడ్డప్పటికీ ఉక్కపోత మాత్రం తీవ్రంగా ఉంది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయనీ, కొన్నిచోట్ల వడగండ్లు కూడా పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.