Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రాజకీయ అంగాలుగా మార్చేసింది
- ప్రజాస్వామ్యం రద్దు అయ్యేలా పాలన చేస్తున్నది : సీతారాం ఏచూరి
- కర్నాటక బాగేపల్లిలో ఉత్సాహపూరితంగా సీపీఐ(ఎం) అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ నామినేషన్
బాగేపల్లి : బీజేపీ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం రద్దు చేయబడుతోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కర్నాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బాగేపల్లి పట్టణంలో నేషనల్ కాలేజీ నుంచి కేబీహెచ్ గ్రౌండ్స్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని అనేక గ్రామాల నుంచి పిల్లలు, 80 ఏండ్ల ముసలి వాళ్ల సైతం ఎర్ర జెండాలు చేతపట్టుకుని కదం తొక్కారు. సీపీఐ(ఎం)కు జై... అనిల్ కుమార్‌ను గెలిపించుకుందాం... అంటూ నినాదాలు చేస్తూ సాగిన ప్రదర్శనతో బాగేపల్లి పట్టణం ఎరుపెక్కింది. అనంతరం సీపీఐ(ఎం) చిక్‌బళ్లాపూర్ జిల్లా కార్యదర్శి మునివెంకటప్ప అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా ముందుకుసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన లౌకికవాదానికి, సౌభ్రాతృత్వానికి, సామాజిక న్యాయానికి, ఫెడరలిజానికి ముప్పు తెచ్చిందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన గవర్నర్ వ్యవస్థ, సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ వంటి వ్యవస్థలను రాజకీయ అంగాలుగా మార్చివేసిందని విమర్శించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరు లేకపోయినా వారికి వ్యతిరేకంగా అవి పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఈ వ్యవస్థల ద్వారా బీజేపీ కూల్చివేస్తున్నదని, ఆ స్థానంలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. కర్నాటక, గోవా, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర రాష్ట్రాల్లో మైనార్టీ ప్రభుత్వంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీల నేతలను తీసుకుని అధికార పగ్గాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఆర్థిక విధానాల్లోనూ కేంద్రం పేదలను కొట్టి పెద్దలకు కట్టబెట్టే చర్యలు చేపడుతోందన్నారు. పేదలపై భారాలు పెంచుతోందని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు గత ఏడు సంవత్సరాల కాలంలో రూ.11 లక్షల కోట్లు మాఫీ చేసిందని గుర్తు చేశారు.
ఇదే సమయంలో పేదల ఆదాయాలు గణనీయంగా పడిపోతున్నాయని తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీస వేతనాల్లో పెరుగుదల లేదని, నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున అసమానతలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పైగా ప్రజల మధ్య మత విద్వేషాగ్నిని రగిల్చే ప్రయత్నాలు ముమ్మరం చేసిందన్నారు. కర్ణాటకలోనూ ఈ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) చిక్‌బళ్లాపూర్ జిల్లా కార్యదర్శి మునివెంకటప్ప అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో జేడీఎస్ రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డి, మహమ్మద్ నూరుల్లా పాల్గొని మద్దతునిచ్చారు. సభ ప్రారంభానికి ముందు మాజీ ఎమ్మెల్యే జివి.శ్రీరామిరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఉమేష్, కర్నాటక రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, కార్యదర్శివర్గ సభ్యులు వరలక్ష్మి, ప్రకాశ్, చిక్‌బళ్లాపుర్ జిల్లా కార్యదర్శి మునివెంకటప్ప పాల్గొన్నారు.