Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశ్రామికవేత్తలకు దోచి పెట్టడానికే కేంద్రం నిర్ణయం
- రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి
- నల్లమలలో బీజేపీని ఓడించాలి
- యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పార్టీలు, సంస్థలు కలిసి రావాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపడితే పర్యావరణానికి తీవ్ర ప్రమాదమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు అన్నారు. యురేనియం విషయంలో బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని డీకే తిరుమలాపూర్, డీకేఉప్పునుంతల గ్రామాల్లో సీపీఐ(ఎం) నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా డిజి నర్సింహారావు మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాల విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామన్నారు. యురేనియం వ్యతిరేక ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పంపిన బృందం నల్లమలలో బోరు బావులు తవ్వి.. యురేనియం, బాక్సైటు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. గతంలోనూ యురేనియం తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. యురేనియం వెలికి తీయడం వల్ల పదిమంది పారిశ్రామికవేత్తలకు తప్ప సాధారణ ప్రజలకు ఎటువంటి ఉపయోగాలూ లేవన్నారు.
నల్లమల్ల అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేస్తే ఎటూ 80 కిలోమీటర్లు కాలుష్యం ఏర్పడటమేగాక సాగు, తాగునీరు కలుషితం అవుతుందని చెప్పారు. హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలు పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉందన్నారు. కృష్ణానదితో పాటు గోదావరి వంటి జీవనదులు సైతం కలుషితమై ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు, శాస్త్రవేత్తలు కలిసి చేసిన ఉద్యమ ఫలితంగా కేంద్రం వెనక్కి తగ్గిందని, ఇప్పుడు మరోసారి నల్లమల అటవీ విధ్వంసానికి కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారానే ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీ మాట్లాడుతూ.. యురేనియం వెలుగు తీసిన ప్రాంతాల పరిస్థితి నేడు దయనీయంగా ఉందన్నారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలు జరపని వ్వబోమని హెచ్చరించారు. చీటికిమాటికి యురేనియం తవ్వకాల అంశం ముందుకు తెస్తున్న బీజేపీని నల్లమలలో ఓడించి తీరాలని పిలుపునిచ్చారు. నల్లమలలో దాగి ఉన్న విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికే కేంద్రం పావులు కలుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదో షెడ్యూల్లో పొందుపరిచినట్టుగా ఈ ప్రాంతంలో ఏ నిర్మాణం చేపట్టినా గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని నిబంధనలు ఉన్నా బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోడీ చెప్పినట్టుగానే రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ యురేనియం విషయంలో మాట్లాడాలన్నారు. దేశ సంపదను అదానీ అంబానీలకు తాకట్టు పెట్టడానికే యురేనియం తవ్వకాలు వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య మాదిరిగా తెలంగాణ మొత్తంగా యురేనియం సమస్య తీవ్రంగా రానున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యాంకులు, రైల్వే, విమానం, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. నేడు యురేనియంపై దృష్టిసారించిందని చెప్పారు. చెంచులు చిన్న చెట్లను కొట్టినా నానా యాగి చేసి కేసులు పెడుతున్న అటవీ అధికారులు.. యురేనియం తవ్వకాలకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. ఈ బృందంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ధర్మనాయక్, శ్రీరామ్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాల్రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, గిరిజన సంఘం నాయకులు దేశ్యా నాయక్, బాలస్వామి తదితరులు ఉన్నారు.