Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కా ఇండ్ల నిర్మాణానికి అడ్డుగా అటవీ చట్టాలు
- ఎండాకాలంలో కాలిపోతున్న చెంచు పెంటలు
- పౌష్టికాహార లోపంతో అనారోగ్యంపాలు
- అంతరించిపోతున్న చెంచులను కాపాడలేని చట్టాలు
- గొడ్డలిపెట్టుగా మారుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు
నవ తెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి /అచ్చంపేట రూరల్
తెలంగాణాలోనే కాక దేశంలోనే అత్యంత వెనుకబడిన తెగలలో చెంచు జాతి ఒకటి. దట్టమైన అడవిలో మానవ సమాజానికి దూరంగా ఉండే పెంట(గూడెం)ల్లో జీవిస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే చెంచు పెంటల పరిస్థితి దయనీయం. నేటికి వీరిలో 10 శాతమే అక్షరాస్యత ఉంది. అయితే, వీరు అటవీ, రెవెన్యూ శాఖల మధ్య నలిగిపోతున్నారు. గిరిజన జాతికి చెందిన మహిళ రాష్ట్రపతి పదవిలో ఉన్నా.. వీరి జీవితాల్లో మాత్రం మార్పులేమీ లేవు. అడవి గడ్డి, ఆకులతో వేసుకున్న పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. ఎండాకాలం అడవిలో మంటలు చెలరేగినప్పుడల్లా గుడిసెలు అగ్నికి ఆహుతవుతూ ప్రాణ నష్టంతో పాటు సర్వం బుగ్గిపాలై కట్టుబట్టలతో నిలువనీడలేక అల్లాడుతున్నారు.
అంతరించిపోతున్న చెంచు జాతిని కాపాడాలనే ఉద్దేశంతో 1975లో చట్టం వచ్చినా ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వీరు సతమతమౌతున్నారు. పౌష్టికాహారం లేక శుభ్రమైన సమతుల్యమైన ఆహారం లోపించి, రక్తహీనత, డయోరియా, మలేరియా, క్షయ, వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతూ చికిత్స అందక చనిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన సామాజిక వర్గాల కోసం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద పక్కా ఇండ్లను నిర్మిస్తే చెంచుల జీవన ప్రమాణాలు పెరిగి చెంచు జాతి అభివృద్ధిలోకి వస్తుంది.
నల్లమల అటవీ ప్రాంతంలో 130 చెంచు పెంటలున్నాయి. వీటి పరిధిలో 7 వేల జనాభా ఉంది. ఆగర్లపెంటలో 8 కుటుంబాలు, రాంపూర్ పెంటలో 20, అప్పాపూర్లో 30, పుల్లయ్యపల్లిలో 6, భౌరాపూర్లో 8, మేడిమల్కలలో 30, గుండాలలో 20, ఈర్లపెంటలలో 50, లింగభేరిలో 4, సార్లపల్లిలో 4 కుటుంబాలున్నవి. రాంపూర్ పెంటలో 20 చెంచు కుటుంబాలు పూరి గుడిసెల్లో జీవిస్తున్నాయి. ఈ మధ్యనే అర్ధరాత్రి మంటలు చెలరేగి 4 పూరిగుడిసెలు, ఒక అంగన్వాడీ కేంద్రం కాలిపోయి సర్వం కోల్పోయారు. రాంపూర్ పెంటకు చెందిన చిగుర్ల పెద్ద బయ్యన్నకు 6 మంది సంతానం కాగా.. సొంత సాగు భూమి లేదు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో అడవి అంటుకొని గుడిసె కాలి బూడిదైంది. పిల్లా పాపలతో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగగా.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాట్రావత్ లక్ష్మమ్మ- అంకులయ్య దంపతులకు నలుగురు పిల్లలున్నారు. 3 సంవత్సరాలుగా ఉపాధి పనులు లేక అటవీ ఫలాల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అడవిలో ఉంటూ ఆకులు, అలమలు తింటున్న వీరి గుడిసె అగ్నికి ఆహుతైంది. సోలార్ ప్లేట్, రేషన్ బియ్యంతో పాటు సర్వం కాలిపోయి చెట్ల కింద జీవనం సాగిస్తున్నారు. చిగుర్ల లక్ష్మయ్య- సలేశ్వరి, వారి తండ్రి చిగుర్ల పెద్ద బయ్యన్నకు చెందిన రెండు గుడిసెలు కాలిపోయి సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు చెట్ల కిందనే ఆశ్రయం పొందుతున్నారు. నిమ్మల లింగస్వామి, తోకల గురువయ్య, కాట్రాజు లింగయ్య, సలేశ్వరంకు పూరి గుడిసెలే వున్నాయి. అప్పాపూర్లో మరో 15 మంది చెంచులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. పక్కా ఇండ్ల నిర్మాణం విషయంలో అటవీ అధికారులు, రెవెన్యూ శాఖల మధ్య సఖ్యత లేక చెంచులకు ముందుకు సాగడం లేదు.
కేంద్రం వివక్ష వల్లే..
ఆది నుంచి ఆదిమ జాతి చెంచులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష కొనసాగుతూనే వుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న చెంచుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అంతరించిపోతున్న చెంచు జాతిని రక్షించడానికి 1975లో చట్టాలు తీసుకొచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. చెంచుల ద్వారా సేకరించిన అటవీ సంపదను, వారి సమీపంలో వున్న కృష్ణానది నీటిని పట్టణాలకు తరలిస్తున్నారు కాని చెంచుల దాహార్తిని తీర్చడం లేదు. పక్కా ఇండ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకాన్ని తమకెందుకు వర్తింపజేయడం లేదని చెంచులు ప్రశ్నిస్తున్నారు.
చెంచుల జీవన ప్రమాణాలు పెంచాలి
నల్లమల అటవీ ప్రాంతంలో ఆదిమజాతి చెంచులు అభివృద్ధికి దూరంగా వున్నారు. వీరికి పక్కా ఇండ్లు లేక ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహారం లేక రోగాలు చుట్టుముట్టి చనిపోతున్నారు. చెంచు జాతిని రక్షించుకోవడానికి తీసుకొచ్చిన 1975 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద కేంద్రం నిర్మించతలపెట్టిన పక్కా గృహాలను చెంచులకు ఇవ్వాలి. మెరుగైన వనరులు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ముఖ్యంగా పక్కా గృహాల నిర్మాణానికి అడ్డుగా వున్న అటవీ చట్టాలను సడలించాలి. కేంద్ర ప్రభుత్వమే చెంచులకు న్యాయం జరిగేలా చూడాలి.
- శంకర్ నాయక్-గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి