Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచరణలో శూన్యం..
- ప్రభుత్వ వైఫల్యాలే మిల్లర్లకు పంట
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలు ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు సరిగ్గా ఉండటం లేదు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లను పరిశీలిస్తే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వరంగల్ జిల్లాలో గతేడాది యాసంగిలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా కేవలం 98 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. హనుమకొండ జిల్లాలోనూ కేవలం 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్లు సైతం హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో విడివిడిగా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్ణయించారు. హన్మకొండ జిల్లాలో 164 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నా 155 మాత్రమే ఏర్పాటుచేశారు. అదనంగా మరికొన్ని కేంద్రాలను పెంచాలనుకున్నా ఆచరణలో అమలుకాలేదు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం హామీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
లక్ష్యానికి ఆమడదూరంలో..
యాసంగి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం లక్ష్యాలకు, క్షేత్రస్థాయిలో కొనుగోళ్లలో భారీ వ్యత్యాసం కనిపిస్తుండడం గమనార్హం. వరంగల్ జిల్లాలో గత యాసంగిలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకుగాను కేవలం 98 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 168 కొనుగోలు కేంద్రాల ద్వారా 24 వేల మంది రైతుల నుంచి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీరికి రూ.193.54 కోట్ల మేరకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. హన్మకొండ జిల్లాలో గత యాసంగిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికిగాను 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 15,953 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు.
గ్రేడ్ ఏ వెరైటీ ధాన్యాన్ని 1,07,737 మెట్రిక్ టన్నులు, కామన్ వెరైటీ ధాన్యాన్ని 2,260 మెట్రిక్ టన్నులు, మొత్తంగా 1,09,998 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలే మిల్లర్లకు పంట
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ టార్పలిన్లు, కాంటాలు, రవాణా వసతులు కల్పిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా, ఆచరణలో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు 10 నుంచి 20 రోజుల వరకు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు తరలించడం కంటే నేరుగా మిల్లర్లకు విక్రయించుకోవడమే శ్రేయస్కరమని భావించిన రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రవాణా సౌకర్యం సకాలంలో ఏర్పాటు చేయడంలో అధికారయంత్రాంగం విఫలమవుతోంది. అదేవిధంగా అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. తద్వారా ధాన్యం నాణ్యత దెబ్బతిని తీవ్రంగా నష్టపోయే ప్రమాదముండటంతో రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయించుకుం టున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,060, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,040 ప్రకటించినా, రైతులు నేరుగా మిల్లర్ల వద్దకు తీసుకువెళ్లి ఇంత కంటే రూ.100-రూ.200 ధర తక్కువకే విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలకు వెళితే రైతుకు మద్దతు ధర వస్తున్నా, సొంత రవాణా పెట్టుకోవాల్సిన దుస్థితి రావడం, ఎక్కువ రోజులు వేచి చూడాల్సి రావడం, ఒకవేళ వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుండటంతో రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయించుకోవడానికే మొగ్గుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో రవాణా, జాప్యాన్ని నివారించగలిగితేనే రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించే అవకాశముంది.