Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాజమాన్యం, జేఏసీ ఒప్పందం
- సమ్మె విరమిస్తున్నాం: టీఎస్పీఈజేఏసీ
- ఒపందాన్ని వ్యతిరేకిస్తున్నాం: టీఎస్‌యూఈఈయూ యాజమాన్యం, జేఏసీ ఒప్పందం
- సమ్మె విరమిస్తున్నాం-టీఎస్పీఈజేఏసీ
- ఒపందాన్ని వ్యతిరేకిస్తున్నాం - టీఎస్‌యూఈఈయూ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగులకు ఏడుశాతం వేతనాలు పెంచేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీనికి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) అంగీకరించింది. ఈ మేరకు యాజమాన్యం తరఫున టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ ఏ గోపాలరావుతో పాటు మరో ఐదుగురు డైరెక్టర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. జేఏసీ తరఫున చైర్మెన్ జీ సాయిబాబు, జీ వరప్రసాద్ (1104 యూనియన్) ఎస్ ప్రభాకర్, ఈ శ్రీధర్ (327 యూనియన్), కేవీ జాన్సన్, కే ప్రకాష్ (హెచ్-58 యూనియన్), ఎమ్ఏ వజీర్, డీ రాధాకృష్ణ (1535 యూనియన్) సంతకాలు చేశారు. సాక్షులుగా టీఎస్పీఈజేఏసీ కన్వీనర్ పీ రత్నాకరరావు, టీఈఈజేఏసీ కన్వీనర్ ఎన్ శివాజీ సంతకాలు చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌యూఈఈయూ) తీవ్రంగా వ్యతిరేకించింది. కార్మికులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది.
సమ్మె విరమణ
ఈనెల 17 నుంచి చేపట్టదలచిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రతిపాదనను విరమించుకుంటున్నట్టు టీఎస్ పీఈజేఏసీ చైర్మెన్ సాయిబాబు, కన్వీనర్ పీ రత్నాకరరావు ప్రకటించారు. యాజమాన్యంతో ఒప్పందం అనంతరం వారు ఈ ప్రకటన చేశారు. తాము ఆశించిన దానికన్నా తక్కువ ఫిట్‌మెంట్‌కు పలు కారణాల రీత్యా ఆమోదం తెలపాల్సివచ్చిందని చెప్పారు. ఫిట్మెంట్ ఏడుశాతం అయినా, ఇంక్రిమెంట్లు ఇతర అలవెన్సులు కలుపుకొని 15శాతం వరకు వేతనం పెరుగుతుందని తెలిపారు. పీఆర్సీ, ఇతర డిమాండ్ల సాధనకు కలిసి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
వ్యతిరేకిస్తున్నాం-టీఎస్‌యూఈఈయూ
విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై యాజమాన్యంతో జేఏసీ నేతలు చేసుకున్న ఒప్పందాన్ని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) వ్యతిరేకించింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షులు కే ఈశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ స్వామి, ప్రధాన కార్యదర్శి వీ గోవర్థన్ 'నవతెలంగాణ'కు తెలిపారు. ఫిట్మెంట్ కనీసం 17 శాతం అయినా వస్తుందని ఆశించామన్నారు. ఆర్టిజన్ల కన్వర్షన్ విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశించామన్నారు. పీస్‌రేట్, అన్‌మేన్డ్ కార్మికుల సమస్యలు అసలు చర్చలకే రాలేదని తెలిపారు. ఏడుశాతం ఫిట్మెంట్ దురదృష్టమనీ, పెరిగిన ధరలకు అనుగుణంగా ఇది ఏమాత్రం సరిపోదన్నారు. పోరాటానికి కార్మికులు సిద్ధంగా ఉన్నా, జేఏసీ నాయకులు యాజమాన్యానికి లోబడి సంతకాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆర్టిజన్ల కన్వర్షన్, పీస్‌రేట్, ఆన్మేన్డ్ కార్మికుల సమస్యలపై యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో సరైన నిర్ణయాలు చేస్తామన్నారు. భవిష్యత్ పోరాటాలకు కార్మికులు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఒప్పందంలోని అంశాలు
- సర్వీస్ వెయిటేజీని బట్టి ఐదేండ్లకు ఒక ఇంక్రిమెంట్, ఐదు నుంచి 15 ఏండ్లకు రెండు, 15 ఏండ్లు ఆపై సంవత్సరాలకు మూడు ఇంక్రిమెంట్లు ఇస్తారు.
- గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి 16 లక్షలకు పెంపు
- మెడికల్ ఎన్హాన్స్మెంట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
- సెల్ఫ్ ఫండింగ్ రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు
- మేజర్ అనారోగ్యాలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు
- ఈఎన్టీ, డెంటల్ చికిత్సలకు రూ.12 వేల నుంచి రూ.50 వేలకు పెంపు
- పాతబకాయిలు 12 సమాన వాయిదాల్లో చెల్లింపు
- ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు అనుకూలంగా వచ్చే బోర్డు సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతారు