Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో కమ్యూనిస్టు పార్టీలను ఐక్యం చేయడమే తమ లక్ష్యమని ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడాలని సూచించారు. పంజాబ్‌లోని చండీఘర్‌లో ఈనెల 13 నుంచి ప్రారంభమైన ఎంసీపీఐ(యూ) జాతీయ కమిటీ సమావేశాలు శనివారం ముగిశాయి. ఎంసీపీఐ(యూ), ఆర్‌ఎంపీఐ కలిసి కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడ్డాయి.
ఈ సందర్భంగా అశోక్ ఓంకార్ మాట్లాడుతూ రానున్న కాలంలో కమ్యూనిస్టు పార్టీలను ఐక్యం చేస్తూ దేశంలో సామాజిక, వర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్, జోతిరావుఫూలే, పెరియార్ రామస్వామి, భగత్‌సింగ్ స్ఫూర్తిని మేళవించి సమగ్ర విప్లవ పంథాను రూపొందిస్తామన్నారు. ఎంసీపీఐ(యూ) పొలిట్‌బ్యూరో సభ్యులు కిరణ్జిత్ సింగ్ షేఖాన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు గాదగోని రవి, శ్రీకుమార్, మహేందర్ నేహా, కాటం నాగభూషణం, వల్లెపు ఉపేందర్‌రెడ్డి, చంద్రమోహన్ ప్రసాద్, అనుభవ దాస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.