Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే వెబినార్లో ప్రొఫెసర్ తిరుమలి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారతదేశ చరిత్ర భిన్నమైనదనీ, కాలానుక్రమంలో దాన్ని చెరిపేయడం సాధ్యం కాదని ఢిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ చరిత్ర అధ్యాపకులు ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'ప్రజల చరిత్రను ముందుకు తీసుకెళ్దాం' అంశంపై జరిగిన వెబినార్లో ఆయన మాట్లాడారు. చరిత్రను మత పరంగా తీసుకొనే ఉద్దేశ్యం బ్రిటీష్ వారి నుంచి స్వీకరించారనీ, భారతజాతిని దేశంగా వారు గుర్తించలేదని తెలిపారు. తమకూ ఓ చరిత్ర ఉందని నిరూపించే క్రమంలో హిందూ, ముస్లిం రాజ్యాల ప్రస్తావనల్ని చరిత్రకారులు రాసారన్నారు. బ్రిటీష్వారికంటే ముందు ముస్లింలు ఈ దేశానికి వచ్చినా, వారు ఇక్కడి ప్రజల్లో ఐక్యం అయ్యారన్నారు. ఇక్కడి హిందూ మహిళలను వివాహాలు చేసుకున్నారనీ, తమ ధర్మాన్ని కాపాడుకుంటూనే, పరధర్మాన్నీ పరిరక్షించారని వివరించారు. కానీ బ్రిటీష్ వారు ఇక్కడి హిందూ మతంతో మమేకం కాలేకపోయారనీ, ఇక్కడి సంపదను తమ దేశాలకు తరలించుకెళ్లారని తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో జాతీయస్ఫూర్తి కోసం మతాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని ఆర్థికం పరిపుష్టం చేయడంపైనే దృష్టి పెట్టారనీ, ఎక్కడా మతాల ప్రస్తావన లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. మొఘల్ చక్రవర్తులు ఇక్కడ పుట్టినవారేననీ, షాజహాన్, జహంగీర్, అక్బర్ హిందూ స్త్రీలకు జన్మించారని గుర్తుచేశారు. పేరుకు ముస్లిం రాజులే అయినా, వారెప్పుడూ హిందువులకు వ్యతిరేకులుగా వ్యవహరించలేదని స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ చరిత్రను తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఇప్పటి ప్రభుత్వం గత చరిత్రను చెప్పేందుకు అవకాశం కల్పించకపోతే, అది అసంపూర్తి చరిత్రే అవుతుందని వివరించారు. చరిత్రను రాజకీయం చేయరాదనీ, సర్దుబాటు చేసుకోవాలనీ, ఇవే పాఠాలను తాము విద్యార్ధులకు చెప్పామని అన్నారు. కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞానకేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.