Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. 2013 వేతన సవరణ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వోద్యోగుల కంటే ఎక్కువగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారని గుర్తు చేశారు.
ఆ తర్వాత 2017, 2021 రెండు వేతన సవరణలు ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులకు అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ రెండు వేతన సవరణలను వెంటనే అమలు జరిపి వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని కోరారు. 2019, డిసెంబర్ ఒకటిన ఆర్టీసీలో గుర్తింపు సంఘ ఎన్నికలను రెండేండ్లు వాయిదా వేస్తున్నామని సీఎం మౌఖిక ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఆ కాలపరిమితి కూడా అయిపోయినందున ఆర్టీసీలో వెంటనే గుర్తింపు సంఘ ఎన్నికలు జరపాలని సూచించారు. ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి కూడా ఎన్నికల కాలపరిమితి ముగిసిపోయినందున ఆ సంస్థలో కూడా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ల ఉనికి లేకపోవడం వల్ల యాజమాన్యం యూనియన్లను సంప్రదించకుండా, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పాటించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మికవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ వేధింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు.
కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా సంభవించిందని గుర్తు చేశారు. కార్పొరేషన్లో ట్రేడ్ యూనియన్ల పాత్ర అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ మంత్రులు కెటి రామారావు, హరీశ్‌రావు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. సీసీఎస్ నిధులను వెంటనే జమ చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.