Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండ్రోజుల పాటు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల విచారణకు అనుమతి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను రెండ్రోజుల పాటు విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల కస్టడీకిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 17, 18 తేదీలలో రెండ్రోజుల పాటు ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలను ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలులోనే విచారించనున్నారు. ముఖ్యంగా, పేపర్ లీక్‌కు పాల్పడ్డ ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలు విదేశాల్లో ఎంత మంది అభ్యర్థులకు వీటిని విక్రయించారు? అందుకు వారికి భారీ మొత్తంలో డబ్బులు ఏ విధంగా విదేశీ అభ్యర్థుల నుంచి అందాయి? అనే కోణంలో ఈడీ అధికారులు విచారించనున్నట్టు తెలిసింది.
కాగా, ఈ కేసును ఇప్పటికీ విచారిస్తున్న రాష్ట్ర సిట్ అధికారులు 18 మంది నిందితులను అరెస్టు చేసి వారిని విచారించడం కూడా జరిగింది. మొత్తం రూ.40 లక్షల మేరకు పేపర్ లీక్ ద్వారా చేతులు మారినట్టు సిట్ అధికారులు ఇప్పటికే తేల్చారు. అయితే, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విదేశీ అభ్యర్థుల ద్వారా వీరికి ఎంతమేరకు మనీలాండరింగ్ జరిగిందనేది ఈడీ తేల్చే ప్రయత్నంలో ఉన్నది. రెండ్రోజుల క్రితం టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ విభాగం ఇంచార్జీ శంకరలక్ష్మి, ఇదే విభాగం అడ్మిన్ సూపరింటెండెంట్ సత్యనారాయణలను విచారించిన అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మెన్ పీఏగా ఉన్న ప్రవీణ్ కుమార్, టీఎస్పీఎస్పీలో కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డిలను విచారించాలని ఈడీ నిర్ణయించింది. ఈ మేరకు కోర్టు అనుమతిని కూడా పొందింది. మరోవైపు, సిట్ అధికారులు ఇప్పటి వరకు ఈ కేసులో నిర్వహించిన దర్యాప్తు అంశాలకు సంబంధించిన పత్రాలను తమకు అందేలా చేయాలని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా కోర్టు నిర్ణయం రావాల్సి ఉన్నది.