Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపోరాటం ఆపాలని చుట్టుముట్టిన కౌన్సిలర్ భర్త, అనుచరులు
- ఆరో రోజు భూపోరాటం చేసి తిరిగొస్తుండగా కాపుకాచి..
- మూకుమ్మడిగా దాడిచేసిన గూండాలు
- వికలాంగుడనీ చూడకుండా పిడిగుద్దులతో చావబాది.. చంపుతామని బెదిరింపులు
- దాడిని తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు
- అదే సమయంలో పేదల గుడిసెలు పీకేసి, జేసీబీతో చెట్లు తొలగించిన అధికారులు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / కోరుట్ల
నిలువనీడ లేని పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని జగిత్యాల జిల్లా కోరుట్లలో భూపోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ తిరుపతినాయక్పై స్థానిక వార్డు కౌన్సిలర్ భర్త, అతని అనుచరులు దాడికి తెగబడ్డారు. ఒంటరిగా బైక్‌పై వెళ్తున్న తిరుపతినాయక్ను కాపుకాచి వెంబడించి అడ్డగించారు. సుమారు 20 మంది మూకుమ్మడిగా పిడిగుద్దులు కురిపించారు. 'మళ్లీ అలగా జనాన్ని వేసుకుని ఇండ్ల స్థలాలు అంటూ పోరాడితే చంపుతాం' అంటూ బెదిరించారు. చుట్టుపక్కల జనం, సీపీఐ(ఎం) నాయకులు చేరుకోవడంతో దాడికి గుండాలు జారుకున్నారు. ఈ ఘటనపై స్థానికపోలీసుస్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. దాడిని తీవ్రంగా ఖండించిన ఆ పార్టీ నాయకులు. ఇదే సమయంలో రెవెన్యూ, పోలీసులు అధికారులు పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించారు. ఆ ఘటనపై సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య తీవ్రంగా ఖండించారు.
సీపీఐ(ఎం) జగిత్యాల జిల్లా కన్వీనర్ తిరుపతినాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లల బాలకృష్ణ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని పేదలు ఇండ్ల స్థలాల కోసం ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. పట్టణంలోని సర్వేనెంబర్ 922, 923లోని ప్రభుత్వ భూమిలో ఇంటి కోసం కాస్త స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రోజువారీ ఆందోళనలో భాగంగానే శనివారం కూడా ఆ స్థలంలో సమావేశమై సాయంత్రం తిరిగి ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఇదే సమయంలో పేదల పక్షాన నాయకత్వం వహిస్తున్న తిరుపతినాయక్ను టార్గెట్ చేసుకుని 18వ వార్డు కౌన్సిలర్ భర్త రహీమ్, అతని అనుచరులు మధ్యాహ్నం నుంచే కాపుకాస్తున్నారు. నిరసన స్థలం నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న తిరుపతినాయక్ను సాయంత్రం 6గంటల సమయంలో పట్టణంలో అడ్డగించారు. దుర్భాషలాడుతూ మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. పిడిగుద్దులు కురిపించారు. 'ఆ భూమిలో మళ్లీ అడుగుపెడితే చంపుతాం' అంటూ బెదిరించారు. అప్పటికే చుట్టుపక్కల జనం, విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) నాయకులు ఘటనాస్థలానికి చేరుకోగానే రహీమ్, అతని అనుచరులు జారుకున్నారు.
ఆ స్థలం కబ్జా చేసేందుకే..
18వ డివిజన్ సమీపంలోనే ప్రభుత్వం స్థలం ఉంది. ఆ స్థలానికి ఆనుకుని ఆ వార్డు కౌన్సిలర్‌కు కొంత భూమి ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో సదరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం సాగించినట్టూ ఆరోపణలు ఉన్నారు. మరోవైపు రహీమ్, అతని అనుచరులపై ఇసుక దందా, భూములు కబ్జా చేయడం వంటి నేరారోపణలూ ఉన్నాయి. భూపోరాటం చేస్తున్న పేదల్లో చాలా మంది మైనార్టీ వర్గానికి చెందినవారే ఉండటం, వారంతా 18వ వార్డుకు చెందిన వారే కావడంతో కంటగింపుగా మారింది. దీంతో సదరు వార్డు కౌన్సిలర్ భర్త రహీమ్, అతని అనుచరులతో ఆ పోరాటాన్ని ఆపేందుకు పథకం వేసుకున్నారు. పేదలకు అండగా నిలిచిన ఎర్రజెండా నాయకులను బెదిరించాలని నిర్ణయించుకుని తిరుపతినాయక్పై దాడి చేశారు.
పేదలు నిరసన తెలుపుతున్న స్థలంలో చెట్ల తొలగింపు
ఇంటి స్థలాల కోసం ప్రభుత్వ భూమిలో పేదలు నిరసన తెలుపుతున్నారు. ఆ స్థలంలోని చెట్టు కింద ప్రతిరోజూ కూర్చుని తమ డిమాండ్ల గళాన్ని వినిపిస్తున్నారు. అక్కడే గుడిసెలూ వేసుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు తొలుత అడ్డుకున్నారు. తరువాత సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణను రెండ్రోజుల కింద అరెస్టు చేశారు. ఏ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారో చెప్పకుండా కోరుట్ల, కథలాపూర్‌లో తిప్పారు. తమ నాయకుని అరెస్టు విషయం తెలుసుకుని పేదలంతా ఆందోళనకు దిగడంతో చేసేదిలేక పోలీసులు బాలకృష్ణను వదిల ేశారు. మర్నాడు ఉదయం నుంచి మళ్లీ యథావిధిగా పోరాటాన్ని కొనసాగించారు. శనివారం సాయంత్రం తిరుపతినాయక్పై స్థానిక అధికారపార్టీ నాయకుడు, శ్రేణులు దాడి చేస్తే.. పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం పేదలు నిరసన తెలుపున్న ప్రదేశంలోని చెట్టును జేసీబీతో తొలగించారు.
దాడులకు బెదరం.. ఆగదు ఈ పోరాటం
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ
దాడులతో ఉద్యమాలను ఆపలేరు. పేదల కోసం ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఎదురీడి పోరాడే చరిత్ర ఎర్రజెండాకు ఉంది. మా నాయకునిపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీసులు వారిని అరెస్టు చేయాలి. దాడులకు దిగినా.. బెదిరింపులకు పాల్పడినా ఆగేది కాదు ఈ భూపోరాటం. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకూ మా ఉద్యమం కొనసాగుతుంది.