Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రం పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- గచ్చిబౌలి స్టేడియంలో 4 వేల మందితో ఉద్యోగుల కృతజ్ఞత సభ
- పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-మియాపూర్
అభివృద్ధిలో రాష్ట్రానికి అవార్డులు రావడంలో సెర్ఫ్ ఉద్యోగుల పాత్ర కీలకం అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందని విమర్శించారు. సెర్ఫ్ ఉద్యోగుల చిరకాల కోరిక పే స్కేల్ పెంపు అమలైన సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో 4 వేల మందితో శనివారం కృతజ్ఞత సభ నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సెర్ఫ్ ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నిజం చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠంపై కేసీఆర్‌ను కూర్చోబెట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సెర్ఫ్ ఉద్యోగుల కృషి గొప్పదని కొనియాడారు. అప్పటి ప్రభుత్వాలు సెర్ఫ్ ఉద్యోగుల మీద ఉక్కుపాదం మోపితే.. ఇప్పుడు కేసీఆర్ మంచి వేతనాలు ఇచ్చి ఆదుకుంటున్నారని చెప్పారు. 2007 నుంచే ఉద్యోగులతో కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉందన్నారు. సెర్ఫ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ అమలు చేశారన్నారు. కరోనా వంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టి నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిటి అయోగ్ చెప్పినా పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. వడ్డీ లేని రుణాల విషయంలో కేంద్రం సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రేమ, అభిమానంతో ఇంత పెద్దఎత్తున సెర్ఫ్ ఉద్యోగులు రావడం పట్ల అభినందనలు తెలిపారు.
ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సెర్ఫ్ ఉద్యోగుల కృషి వల్లే సంఘాలు ఐకేపీగా ఏర్పడి చాలా అద్భుతంగా పని చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి పోయిందన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల విషయంలో ప్రత్యేక కృషితోనే మహిళా సాధికారత సాధ్యమైందని చెప్పారు.