Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీల్‌చైర్ తెచ్చేలోగా రోగిని లాక్కెళ్లిన తల్లిదండ్రులు
- ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్
- అది ప్రభుత్వ ఆస్పత్రిపై దుష్ప్రచారం : జీజీహెచ్ సూపరింటెండెంట్
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సమయానికి స్ట్రెచర్ లేకపోవడంతో లిఫ్ట్ ఆగిందని పేషెంట్ కాళ్లను పట్టుకొని లాక్కుంటూ వెళ్లిన వీడియో ఫుటేజీ శనివారం సోషల్‌మీడియాలో వైరల్ అయింది. గత నెల 31వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ఓ పేషెంట్‌ను అపస్మారక స్థితిలో తీసుకొచ్చారు. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో పేషెంట్‌ని కుటుంబ సభ్యులు నేలపై పడుకోబెట్టి, రెండు కాళ్లు పట్టి లాక్కెళ్లడం వీడియోలో ఉండటంతో కలకలం రేపింది.
కాగా ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించారు. విచారణకు ఆదేశించారు. దాంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో మెరుగైన వైద్యం కల్పిస్తుండటంతో ప్రయివేటు ఆస్పత్రులు ఖాళీ అవుతున్నాయని, ఇది ఓర్వలేక జీజీహెచ్‌పై కుట్రలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రోగి కాళ్లు పట్టుకుని లాగుతున్న పది సెకన్ల వీడియోను పోస్టుచేసి ఆస్పత్రిపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతిసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. పేషెంట్ కేర్ సిబ్బంది చక్రాల కూర్చీ తీసుకొచ్చే లోగా.. లిఫ్ట్ వచ్చిందని తల్లిదండ్రులు ఆ రోగిని లాగుతూ తీసుకెళ్లారని వివరించారు. రెండో అంతస్తులో పేషెంట్ కేర్ సిబ్బంది వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్లీ వీల్‌చైర్‌లోనే గ్రౌండ్ఫ్లోరుకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ మేరకు సీసీ కెమెరాల వీడియోను కూడా ఆమె పోస్టు చేశారు. ఇదంతా తెలియక ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, సమగ్రమైన అవగాహన లేకుండా, పూర్తి సమాచారం తెలియకుండా ఇలాంటి వీడియోలు తీసి ప్రభుత్వ ఆస్పత్రులపై దుష్ప్రచారాలు చేయడం చాలా బాధాకరం అన్నారు. ఆ రోజు రోగిని లాగుతున్న సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తిని సిబ్బంది ప్రశ్నించడంతో అక్కడి నుంచి జారుకున్నాడని తెలిపారు.
జీజీహెచ్‌లో సరిపడా వీల్చైర్లు, స్ట్రెచర్లు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో 57 స్ట్రెచర్లు, 51 వీల్చైర్లు, స్టోర్‌లో మరో 41 వీల్చైర్లు ఉన్నాయని తెలిపారు. పైగా ఆస్పత్రిలో సుమారు 200 సీసీ కెమెరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు 24 గంటలు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జీజీహెచ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, ఈ సమయంలో ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు.