Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు
- ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ వినోద్‌కుమార్ విమర్శ
- టూరిజం కార్పొరేషన్ చైర్మెన్‌గా గెల్లు శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ :
- టూరిజం హబ్‌గా తెలంగాణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణలోని పర్యాటకరంగంపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని, ఆ పార్టీకి చెందిన నలుగురు రాష్ట్ర ఎంపీలు ఏనాడూ టూరిజం గురించి మాట్లాడలేదని ప్రణాళిక సంఘం వైస్‌చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. టూరిజం కార్పొరేషన్ చైర్మెన్‌గా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ బాధ్యత స్వీకరించిన సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ టూరిజం గురించి కేంద్రానికి ఎన్నిసార్లు విన్నివించినా చీమకుట్టినట్టుగా కూడ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వేములవాడ, యాదాద్రి, కొండగట్టు, కాళేశ్వరం, జోగులాంబ లాంటి గొప్ప గొప్ప దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నా ప్రాచుర్యం పొందకుండా అడ్డుకున్నారని తెలిపారు. బెంగుళూరులో ఉన్న బృందావన్ గార్డెన్ కంటే నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం తక్కువేమికాదని గుర్తుచేశారు. కాని బుద్ధవనం ప్రాచుర్యం పొందకుండా కుట్రలు చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. రామప్ప టెంపుల్‌కు యునెస్కో గుర్తింపు కోసం రాలేదని, 2004 నుంచి ఎంతో కృషిచేశామని తెలిపారు. పర్యాటకం శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం ఇలా రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. దేశానికి బీఆర్ఎస్ గొప్ప స్థానం కల్పించడానికి కృషి చేస్తున్నదని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో టూరిజం అభివృద్ధి శాయశక్తుల కృషిచేస్తానని అన్నారు. పర్యాటకరంగం అభివృద్ధి అయితే హోటల్స్, క్యాబులు, ఆటోలు, ఇతర సర్వీసు రంగాలు అభివృద్ధి అవుతాయని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్త్తుందని అన్నారు. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండాప్రకాష్ ముదిరాజ్, మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు సురభివాణిదేవి, పాడి కౌశిక్‌రెడ్డి, శాట్ చైర్మెన్ ఆంజనేయులుగౌడ్, బేవరేజ్ కార్పొరేషన్ చైర్మెన్ గజ్జెల నగేష్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.