Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీజు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లీజు నిబంధనలు ఉల్లంఘించి ప్రాజెక్టులు చేపట్టిన వారిపై కేసులు నమోదు చేసినట్టు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారికి కేటాయించిన రూ.1,000 కోట్ల విలువైన రెండు స్థలాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని చెప్పారు. ఏడాది కాలంలో రూ.50 కోట్ల పాత బకాయిలను వసూలు చేసినట్టు తెలిపారు. ఆ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయడంలో కృషి చేసిన పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎండీ మనోహర్, ఒఎస్డీ సత్యనారాయణ, లీగల్ ఆఫీసర్ ఆదిల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. శామీర్‌పేట్, జవహర్‌నగర్‌లోని సర్వే నెంబర్ 12లో సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్స్ అభివ ృద్ధి పేరుతో ప్రజరు ఇంజనీర్స్ సిండికేట్ సంస్థ 130 ఎకరాల టూరిజం శాఖకు చెందిన భూమిని 2004 సంవత్సరంలో తీసుకుని లీజు నిబంధనలు పాటించలేదని మంత్రి తెలిపారు. సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ పక్కన ఉన్న 4,600 గజాల విలువైన భూమిని ఇ-సిటీ జెయింట్ స్క్రీన్ (ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్ లీజుకు తీసుకుని నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిందని తెలిపారు. ఆ రెండు సంస్థలు ఎలాంటి ప్రాజెక్టు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మెన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మనోహర్ , ఒఎస్ డీ సత్యనారాయణ, లీగల్ ఆఫీసర్ ఆదిల్ పాల్గొన్నారు.