Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగిలో పండిన మొక్కజొన్నల కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ద్వారా తక్షణమే చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలుపై చూపిన శ్రద్ద ముతక ధాన్యాల సేకరణపై చూపడం లేదని పేర్కొంది. గత రెండేండ్ల క్రితం మార్క్‌ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధరలకు ముతకధాన్యాలు కొనుగోలు చేసిందని తెలిపింది.
ఈమేరకు ఆదివారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి. సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2022-23లో 14.25 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, రాగులు, కొర్రలు, సజ్జ పంట వేశారని తెలిపారు. అందులో ఏడు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైందని పేర్కొన్నారు. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1,962 ఉందనీ, కానీ ప్రయివేటు వ్యాపారులు మాత్రం క్వింటాల్‌కు రూ.1200-1300లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసి కోళ్ళ పరిశ్రమకు, చేపల పెంపకానికి, పశువుల దాణాకు వినియోగించే వారికి అమ్మాలని సూచించారు. బీహార్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న మొక్కజొన్నలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే మార్క్‌ఫెడ్ కనీస మద్దతు ధరలకు మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని వారు కోరారు.