Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండా
- పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలి
- ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాత పెన్షన్ అంశమే ప్రధాన ఎజెండా కాబోతుందనీ, అది అమలు చేసిన పార్టీలకు ప్రజలు పట్టం కడతారని ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ ఎల్బీ స్టేడియం నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళలర్పించి ఆయన పాదాలకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ స్కీం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 565 జిల్లాల్లో పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్‌లు జరుగుతున్నాయని సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము పెన్షన్ ఫండ్‌ను తిరిగి ఇచ్చేందుకు పీఎఫ్ఆర్డీఏ చట్టంలో ఎగ్జిట్ లేదనికేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పడం శోచనీయమన్నారు. సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాల సొమ్ము తిరిగి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను పీఎఫ్ఆర్డీఏ చట్టం కాలరాస్తుందనీ, ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనూ ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో మార్చ్‌లు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావు, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కోటకొండ పవన్, అధిక సంఖ్యలో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.