Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఇండియా మీడియేషన్ డే' లో మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చెప్పారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఎఎంసీ)లో ఆదివారం నిర్వహించిన 'ఇండియా మీడియేషన్ డే' లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ మీడియేషన్ డే కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో మీడియేషన్ కేంద్రం ఏర్పాటుపై జస్టిస్ లావు నాగేశ్వరరావు, తాను ఎన్నో సార్లు చర్చించుకున్నామని చెప్పారు. మొదట్లో చిన్న స్థాయిలో మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేద్దామనుకున్నాం.. కానీ లావు నాగేశ్వరరావు దాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పారు. హైదరాబాద్ మీడియేషన్ కేంద్రం ఏర్పాటు వెనుక జస్టిస్ లావు నాగేశ్వరరావు కృషి ఎంతో ఉందన్నారు. మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఎంతో సహకరించారని చెప్పారు. ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్నదనీ, దీనివల్ల ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని చెప్పారు. మధ్యవర్తిత్వం అనేది మన పురాణాల కాలంలోనూ ఉందన్నారు. కౌరవులు, పాండవులు మధ్య కృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని గుర్తుచేశారు. ఆర్థిక సంస్కరణల కారణంతో పాటు మీడియేషన్ బిల్లు రాక వల్ల మధ్యవర్తిత్వ ప్రాధాన్యం భారత్‌లోనూ పెరిగిందని వివరించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ విశ్వసనీయతతో వేగవంతంగా సాగాలనీ, ఉభయపక్షాలకు ఉపయోగకరంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ ఉండాలనీ జస్టిస్ ఎన్వి రమణ ఆకాంక్షించారు. మీడియేషన్లో కృత్రిమమేథనూ భాగం చేయడం మంచి పరిణామమని చెప్పారు. జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రన్, పలువురు న్యాయకోవిదులు పాల్గొన్నారు.