Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామసముద్రం చెరువులో మృతదేహం లభ్యం
- అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు
నవతెలంగాణ-నారాయణఖేడ్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గురుకుల విద్యార్థి అదృశ్యమైన ఘటన విషాదంగా ముగిసింది. రెండ్రోజుల కిందట ప్రిన్సిపాల్‌కు తెలియకుండా నలుగురు విద్యార్థులు బయటకు వెళ్లారు. ముగ్గురు తిరిగి రాగా.. 9వ తరగతి విద్యార్థి మహేష్ కనిపించకుండా పోయాడు. గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందజేయగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఆదివారం రామసముద్రం చెరువులో అనుమానాస్పదంగా మహేష్ మృతదేహం లభ్యం అయింది. దాంతో మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే విద్యార్థి మృతిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి మృతికి కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారికి విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆయా సంఘాల నాయకులు భరోసానిచ్చారు. విద్యార్థి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, గురుకుల ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతి గురించి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి తెలియగా.. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా అంత్యక్రియల కోసం ఆర్సీఓ రూ.20వేలు అందజేశారు. మృతుని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు సమాచారం.